హుస్నాబాద్ టౌన్, ఆగస్టు 5 : ఆస్తిపన్ను, నల్లాపన్ను వసూ లు చేసే మిషన్లు 25 రోజులుగా మూలనపడ్డాయి. సాఫ్ట్వేర్ విషయంలో ఏర్పడిన ఇబ్బందులతో పన్ను వసూళ్లు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలు సరిచేసేందుకు మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు సరైన ప్రయత్నాలు చేయకపోవడంతో కొత్త మిషన్లు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బల్దియాపై అదనపు భారం పడనున్నది. ప్రతి మున్సిపాలిటీలో ఆస్తిపన్నుకు సంబంధించి చేతిరాతతో ఇచ్చే రసీదులకు చెక్‌పెట్టి ఆన్లైన్లో పన్నులు చెల్లించే విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది.
దీనికోసం పన్ను వసూలు చేసే బిల్ కలెక్టర్లకు హ్యాండిల్ డివైజ్ మిషన్లు ఇచ్చింది. హుస్నాబాద్ మున్సిపాలిటీలో ఐదుగురికి అధికారులు మిషన్లు అందజేశారు. వీటితో ఆయా వార్డుల్లోని ఇండ్లకు వెళ్లి ఆస్తి, నల్లా పన్ను వసూలు చేస్తున్నారు. కానీ, హ్యాండిల్ డివైజ్ మిషన్లలో ఏర్పడిన సాంకేతి కారణాలతో పన్ను వసూళ్లు నిలిచిపోయాయి. దాదాపు 25 రోజులుగా పట్టణంలో పన్ను వసూళ్లు నిలిచిపోయాయి. దీంతో మున్సిపల్‌కు నిత్యం పన్నుల ద్వారా రావాల్సిన ఆదాయం ఆగిపోయింది. ఆస్తిపన్ను చెల్లింపు ఆలస్యంతో ఇండ్ల యజమానులపై అపరాధ రుసుము పడుతున్నది.
ఈ క్రమంలో పన్నులు చెల్లించేందు కు మున్సిపల్ కార్యాలయానికి రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. హుస్నాబాద్ మున్సిపాలిటీ రెండేండ్ల క్రితం ఐదు హ్యాండిల్ డివైజ్ మిషన్లు కొనుగోలు చేసింది. ఇంతలోనే సాంకేతిక సమస్యలు, సాఫ్ట్వేర్ మార్పుపేరుతో మళ్లీ కొత్త మిషన్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. కొత్తగా మరో ఎనిమిది మిషన్లను కొనుగోలుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మిషన్ల కొనుగోలుకు దాదాపు లక్ష రూపాయల వరకు వ్యయం కానున్నది.
మిషన్లను అందజేసే కంపెనీలపై మున్సిపల్ శాఖ నుంచి సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొన్న కొద్దినాళ్లకే వాటిని పక్కన పడేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిపై హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ టి.మల్లికార్జున్‌గౌడ్ స్పందించారు. ప్రస్తుతం పన్ను వసూలు చేసే మిషన్లలో సాఫ్ట్వేర్ మార్చే అవకాశం లేకపోవడంతో కొత్తవి ఎనిమిది కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే మిషన్లు రాగానే పన్ను వసూళ్లు యధావిధిగా చేపడతామని చెప్పారు.