న్యాల్కల్, జూలై 11: పెండ్లి విషయంలో మనస్తాపానికి గురై మండలంలోని రేజింతల్‌లో గురువారం బాలిక ఆత్మహత్య చేసుకుందని హద్నూర్ పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన బర్ధీపూర్ శ్వేత(16)అదే గ్రామానికి చెందిన నట్కారీ రమేశ్‌తో ప్రేమలో ఉంది. ఈ విషయంలో గతంలో యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇటీవల పెద్దల సమక్షంలో బాలికను పెండ్లి చేసుకోవాలని యువకుడిపై ఒత్తిడి తీసుకురావడంతో ఒప్పుకున్నాడు. బాలిక మైనర్కావడంతో 18 ఏండ్లు నిండిన తర్వాత పెండ్లి చేసుకుంటానని, అప్పటివరకు చదివించాలని కుటుంబసభ్యులను యువకుడు కోరాడు. ఇటీవల హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన బాలిక రమేశ్‌తో పెండ్లి జరుగుతదో, లేదోనని మనస్తాపంతో ఇంట్లో దూలానికి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలితల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.