సిద్దిపేట,సెప్టెంబర్13: “విద్య అనేది ఉద్యోగం కోసమే కాకుండా గొప్ప సమాజ నిర్మాణం కోసం అవసరం…సమాజ భవిష్యత్ ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంద ని..రేపటి భవిష్యత్ తరగతి గదుల్లోనే నిర్మించబడుతుందని, అది ఉపాధ్యాయుల ద్వారా నే సాధ్యం ” అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వైశ్య భవనంలో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్, ట్రస్మా నాయకుడు శ్రీనివాస్‌రెడ్డితో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఉత్తమ అవార్డులు ఇస్తారని, ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులను సిద్దిపేటలో సన్మానం చేసుకుంటున్నామన్నారు. ఉన్నతమైన సమాజ నిర్మాణం కోసం తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు ముఖ్యమన్నారు. నేడు యువత ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి, ఆన్లైన్ గేమ్స్‌కు బానిసలుగా మారుతున్నారని,వాటి నుంచి దూరం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం కోసం క్రీడలు తప్పకుండా ఉండాలన్నారు.
ర్యాంకుల కోసమే కాకుండా ఆరోగ్యం కోసం విద్యార్థులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గెలుపు, ఓటములను తట్టుకునే శక్తి క్రీడల వల్ల వస్తుందన్నారు. విద్యారంగంలో సిద్దిపేట జిల్లా మొదట స్థానంలో ఉందని,విద్యార్థులకు చిన్ననాటి జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, సిద్దిపేటను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చినట్లు గుర్తుచేశారు. ప్రభుత్వం గురుపూజోత్సవం రోజు ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులను సన్మానం చేయాలని కోరారు. మహిళలు ఇంటి పనులతో పాటు ఉద్యోగం చేస్తూ కుటుంబానికి చేయూతగా నిలుస్తున్నారన్నారు.
గత ఐదేండ్ల నుంచి టెన్త్ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా మొదటి, రెండో స్థానంలో నిలుస్తుందన్నారు. మెగా డీఎస్సీ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందన్నారు. ఈసంవత్సరం ప్రైవేట్ ఉపాధ్యాయుకు ఉచిత బీమా అందజేస్తామన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ నేడు జిల్లా వ్యాప్తంగా తక్కువగా జీతాలు ఉన్న 8వేల మంది ప్రైవేట్ టీచర్లు గ్రామీణ విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తున్నారన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దుకోవాలన్నారు. ప్రైవేట్ ఉపాధ్యాయులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
ఉపాధ్యాయులకు ఉండే నైపుణ్యత ..విద్యార్థుల పట్ల ఎనలేని ప్రేమ ఉంటేనే గొప్ప ఉపాధ్యాయుడిగా రాణిస్తారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా మారితేనే విద్యార్థులకు మంచి విద్యను అందించవచ్చన్నారు.టీచర్ యాం త్రికంగా ఉంటే విద్యార్థులకు గొప్ప ఫలితాలు రావన్నారు. దేశభవిష్యత్ తరగతి గదుల్లోనే నిర్మితమవుతుందని, అందువల్ల ఉపాధ్యాయుల వ్యక్తిత్వం విద్యార్థులపై ప్రభావం చూపుతుందన్నారు.
నాకు కవి కావాలనే ఆలోచన మా గురువు వేముగంటి వల్లనే వచ్చిందన్నారు. భారతీయ తత్వ చింతనను చాటిచెప్పిన గొప్ప వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ అని, స్త్రీ విద్య కోసం కృషిచేసి మహనీయురాలు సావిత్రీబాయి ఫూలే అన్నారు.నేడు సెల్‌ఫోన్ విద్యార్థులపై పెను ప్రభావం చూపుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు,ట్రెస్మా రాష్ట్ర కోశాధికారి రాఘవేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సోమేశ్వర్‌రెడ్డి, గుంట రాజు దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.