గుమ్మడిదల, ఫిబ్రవరి 25: ప్యారానగర్ డంపింగ్‌యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ 21 రోజులుగా సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించకపోవడంపై బాధిత గ్రామాల ప్రజలు, జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం దున్నపోతైనా స్పందిస్తుంది, కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని మంగళవారం గుమ్మడిదలలో దున్నపోతులతో హైవేపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం దున్నపోతులకు వినతి పత్రాన్ని అందజేసి వినూత్న నిరసన తెలిపారు. గుమ్మడిదలలో రైతు, మహిళా జేఏసీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్‌రెడ్డి, ఇందుల మల్లమ్మ ఆధ్వర్యంలో దున్నపోతులతో ర్యాలీ నిర్వహించారు.
అనంతరం తహసీల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ప్రభుత్వం మొద్దునిద్ర, మొండిపట్టుదలను వీడి డంపింగ్ యార్డు ఏర్పాటును విరమించాలని డిమాండ్ చేశారు. దున్నపోతులకు ఫ్లకార్డులు తగిలించి నిరసన తెలిపారు. సేవ్ ఫారెస్ట్, సేవ్ ఫార్మర్ అంటూ నినాదాలు చేశారు. గుమ్మడిదల దీక్షా శిబిరంలో ఏకలవ్య కులస్తులు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్యారానగర్-నల్లవల్లిలో 21వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. రజక సంఘం సభ్యులు దీక్ష చేపట్టారు. ఆనంద్, సురేశ్, వెంకటేశ్, ఆశయ్య, చంద్రయ్య, నరేశ్, దాసు, కుమ్మరి ఆంజనేయులు, ఫయాజ్ షరీఫ్, కొత్తపల్లి మల్లేశ్ గౌడ్ దీక్ష చేపట్టారు.
డంపింగ్‌యార్డును ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలంటూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్లో సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు చుక్కా రాములు, నాగేశ్వర్రావు, రాజయ్య, ప్రజాసంఘాల నాయకులు,కొత్తపల్లి మల్లేశ్‌గౌడ్ రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ.. డంపింగ్ యార్డు పోరుకు ప్రజాసంఘాలతో కార్యాచరణ సిద్ధ్దం చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వానికి, గ్రీన్ ట్రిబ్యునల్‌కు, పర్యావరణ శాఖకు, పీసీబీ శాఖకు నివేదించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం దిగిరాకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
ఈనెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను గుమ్మడిదల మండలంలోని పట్టభద్రులు బహిష్కరించాలని నిర్ణయించారు. ఈ మేరకు రైతు జేఏసీ నాయకులతో కలిసి తీర్మానం చేశారు. మండలంలో 291 మంది పట్టభద్రులు,19 మంది టీచర్ ఎమ్మెల్సీ ఓట్లు ఉన్నాయి. మంగళవారం రైతుజేఏసీ అధ్యక్షుడు జైపాల్‌రెడ్డి అధ్యక్షతన అఖిలపక్షం ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తాము డంపింగ్‌యార్డును వ్యతిరేకిస్తున్నట్లు ఈ సందర్భంగా మండలంలోని పట్టభద్రులు తెలిపారు.
ప్రజలు ఉధృతంగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడంతో తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేయవద్దని నిర్ణయించుకుని తీర్మానం చేసుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు తేల్చిచెప్పారు. డంపింగ్‌యార్డుతో నర్సాపూర్ నియోజకవర్గానికి ముప్పు ఉందని, అక్కడి పట్టుభద్రులు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించాలని రైతు జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అఖిలపక్ష పార్టీల నాయకులు పుట్టనర్సింగ్రావు, నరేందర్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, తులసీదాసు, ప్రభాకర్‌రెడ్డి, మద్దులబాల్రెడ్డి, మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్, ఐలేశ్, రాజిరెడ్డి, రాంరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, బాల్‌రెడ్డి, స్వేచ్ఛారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, విష్ణురెడ్డి, వీరారెడ్డి, శ్రవణ్ పాల్గొన్నారు.