జహీరాబాద్, మే 9 : పుడమి తల్లి పులకించేలా గ్రామాలన్నీ పచ్చని మొక్కలతో కళకళలాడుతున్నాయి. గత బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. ప్రతి గ్రామంలో రోడ్లు హరిత తోరణాలతో స్వాగతం పలుకుతున్నాయి. ఏ వీధి చూసినా పచ్చని చెట్లతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. ఇదే క్రమంలో సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలంలోని మామిడిగి, హుస్సేలి, గుంజేటి, రామ్ తీర్థ్ తదితర గ్రామాలలో రోడ్లకు ఇరువైపులా ఎటు చూసినా పచ్చని చెట్లతో కళకళాడుతున్నాయి.
అప్పట్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తుల సహకారంతో గ్రామాలను హరిత గ్రామాలుగా మార్చారు. ప్రధాన రహదారి అయిన రాయచూరు రోడ్డు వెంట చెట్లు విరబూసి స్వాగతం పలుకుతున్నాయి. అంతేకాక పంచాయతీ కార్యాలయం, పకృతివనం, రైతువేదిక ఆవరణం, పాఠశాల మైదానం మొత్తం హరితమయంగా మారిపోయింది. అటుగా వెళ్లే వారు చెట్ల ముందు నిలుచోని సెల్ఫీలు తీసుకొంటూ కాసేపు అక్కడే నిలబడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూన్నారు.