అక్కన్నపేట, ఫిబ్రవరి 20: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో గుడుంబా దందా మళ్లీ మొదలైంది. ఇష్టారాజ్యంగా గుడుంబా తయారీ, రవాణా, అమ్మకాలు జరుగుతున్నాయి. పీడీ కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కానీ, తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటుండడంతో తయారీదారులు లెక్కచేయకుండా గుడుంబా దందా సాగిస్తున్నారు. మండలంలో సుమారు 100 వరకు గిరిజన తండాలు ఉన్నాయి.
బీఆర్ఎస్ హయాంలో గుడుంబాపై ఉక్కుపాదం మోపగా, కాంగ్రెస్ పాలనలో నాటుసారా ఏరులై పారుతున్నది. అక్కన్నపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు కూత వేటు దూరంలో యథేచ్ఛగా గుడుంబా అమ్మకాలు జరుగుతుండడం గమనార్హం. గడిచిన రెండు నెలల్లో హుస్నాబాద్ ఎక్సైజ్ పోలీసులు జరిపిన దాడుల్లో సుమారు 80శాతం మేర అక్కన్నపేట మండలంలోనే కేసులు నమోదయ్యాయి.
బీఆర్ఎస్ సర్కారు గుడుంబా తయారీపై ప్రత్యేక దృష్టిసారించి, పూర్తిగా అణిచివేసింది. గుడుంబాకు వాడే నల్లబెల్లం విక్రయాలను నిషేధించింది. వ్యాపారులు ఇతరత్రా అవసరాల కోసం విక్రయించే తెల్ల బెల్లానికి కూడా నిబంధనలు పెట్టింది. గుడుంబా తయారీ దారులను గుర్తించి, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపింది. కానీ, కాంగ్రెస్ సర్కారు వచ్చిన కొద్దిరోజుల్లోనే తండాల్లో తిరిగి గుడుంబా తయారీ జోరుగా కొనసాగుతోంది.
ప్రధానంగా వ్యవసాయ బావుల వద్ద, తండాల్లోని ఇండ్ల సమీపంలో గుడుంబా బట్టీలను ఏర్పాటు చేసి సారా తయారు చేస్తున్నారు. రాత్రివేళల్లో ద్విచక్ర వాహనాలపై గుడుంబాను నంగునూర్, మద్దూరు, హుస్నాబాద్, కోహెడ, వేలేరు, అక్కన్నపేట, తరిగొప్పుల మండలాలతో పాటు వివిధ గ్రామాల్లోకి సరఫరా చేస్తున్నారు.
గడిచిన రెండు నెలల్లో హుస్నాబాద్ ఎక్సైజ్ పోలీసులు 24 నాటుసారా కేసులు నమోదు చేశారు. ఇందులో 20 మందిని అరెస్టు చేశారు. గుడుంబా తయారుచేస్తున్న 18 మందిపై కేసులు నమోదు చేసి తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేశారు. 8 మంది బెల్లం వ్యాపారులను ముందస్తుగా బైండోవర్ చేశారు. బైండోవర్ ఉల్లంఘన కింద ఇద్దరిని జైలుకు పంపించగా, మరో ఇద్దరికి ఒక్కొక్కరికీ రూ.50 వేల చొప్పున రూ. లక్ష జరిమానా విధించారు. పోలీసుల దాడుల్లో 50లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోగా, 800 లీటర్ల బెల్లంపానకాన్ని ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. అధికారికంగా ఇన్ని కేసులు నమోదు అయ్యాయంటే అనధికారికంగా గుడుంబా దందా ఏ స్థాయిలో నడుస్తుందోనని పలువురు పేర్కొంటున్నారు.