ఒకప్పుడు భూమి కొనుగోలు చేస్తే రేపటి భద్రత అనుకున్నారు. ఇల్లు కట్టుకుంటే తరతరాలకు ఆస్తి అనుకున్నారు. కానీ, ఇప్పుడు భూమి చేతిలో ఉన్నా, దానిపై పూర్తి హక్కు వినియోగించుకోలేని పరిస్థితి వస్తే? ఇదే ప్రశ్న గుమ్మడిదల పరిధిలోని పలువురు భూ యజమానులను వెంటాడుతోంది. ధరణిలో ఉన్న లోపాలను సరిచేసి భూరికార్డులను ప్రక్షాళన చేసి, సామాన్యుడికి సులభంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో భూభారతి వ్యవస్థను ప్రభుత్వం తెచ్చింది. అయితే 22ఏ నిషేధిత జాబితాలోకి ఇష్టారాజ్యంగా భూములను చేర్చడంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
గుమ్మడిదల, ఆగస్టు 23: ఒక ఆస్తి నిషేధిత జాబితాలోకి చేరినప్పుడు దాని యజమాని ఎదుర్కొనే ఇబ్బంది కేవలం రిజిస్ట్రేషన్ వరకే పరిమితం కాదు. అవసరానికి ఆస్తిని విక్రయించుకోవడం, బ్యాంకు రుణం కోసం కుదువపెట్టడం వంటి వ్యవహారాలు కూడా క్లిష్టంగా మారుతాయి. ఏం డ్లుగా తమ ఆధీనంలో ఉన్న భూమి ఒక్కసారిగా 22ఏ జాబితాలోకి కనిపిస్తే, ఇది ఎలా జరిగింది? అనే ప్రశ్నకు సమాధానం కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమిని కొనుగోలు చేసినప్పుడు సమస్య లేదు. ఇల్లు కట్టుకున్నప్పుడు సమస్య లేదు. కానీ, ఇప్పుడు రికార్డుల్లో నిషేధిత ముద్ర ఎందుకు? అన్నదే బాధితుల ప్రశ్న.
అన్నారంలో ఇల్లు కట్టుకున్నాక నిషేధిత జాబితాలోకి..
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని అన్నారంలోని సర్వే నంబర్ 199లో సుమారు ఆరు ఎకరాల భూమిలో ‘ప్రకృతి వనం’గా కాలనీ ఏర్పడింది. ఇందులో చాలా వరకు ఇండ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. కొందరు సొంత ఆస్తి ఉందని ధీమాగా ఉన్నారు. కానీ, ఒక్కసారిగా 22ఏ నిషేధిత జాబితాలోకి ప్రకృతివనం కాలనీ చేరడంతో ఇంటి యజమానులు కలవరపడుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ ఎం.పరమేశాన్ని ఆశ్రయించగా, పొరపాటును త్వరలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఏదేమైనా 22ఏ నిషేధిత జాబితాలోకి తమ ఆస్తులు చేరడంతో ఎప్పుడు పరిష్కారం లభిస్తోందని కాలనీ వాసులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
అనంతారంలో 160 ఎకరాలు 22ఏ నిషేధిత జాబితాలోకి…
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని అనంతారంలో 173,174 సర్వే నంబర్ భూములు 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో భూయజమానులు ఆందోళన చెందుతున్నారు. 174 సర్వే నంబర్లో 110 ఎకరాల భూమి ఉంది. ఇందులో అనంతారం గ్రామానికి చెందిన ఊట్ల రామన్న, భూపతిరెడ్డిలో 1962 రెవెన్యూ చేతివార్ కింద వారు పట్టాదారులు కాగా, మిగిలిన అసైన్డ్ భూములను 40 ఏండ్ల క్రితం అప్పటి ప్రభుత్వం కరీంనగర్‌కు చెందిన నలుగురు స్వాతంత్య్ర సమరయోధులకు 10 ఎకరాల చొప్పున 40 ఎకరాలు పట్టా లు అందజేసింది. వీరు పదేండ్లు ఈ భూముల్లో సేద్యం చేసుకున్న అనంతరం, వారు వృద్ధా ప్యం రావడంతో అనంతారం గ్రామానికి చెం దిన 30 మంది రైతులకు 40 ఎకరాలు విక్రయించారు. దీంతో భూములు కొనుగోలు చేసిన వారు పట్టాదారులుగా రెవెన్యూ రికార్డులోకి చేరారు.
174/2 నుంచి 174/9 వరకు పట్టా భూములుగా ఉన్నాయి. మిగిలిన అసైన్డ్ భూములు 174/1లో ఉండగా, కేవలం 174/1లో ఉన్న అసైన్డ్ భూములను ఆధారంగా చేసుకుని మిగిలిన బై నంబర్లను 22ఏ నిషేధిత జాబితాలోకి చేర్చారు. దీంతో అసలైన పట్టాదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 173 సర్వే నంబర్లో 50 ఎకరాల అసైన్, పట్టాభూములు ఉన్నాయి. అప్పట్లో అప్పటి ప్రభుత్వం పేదలకు వ్యవసాయం చేసుకోవడానికి పట్టాలు ఇచ్చింది. ఇందులో కొంత అసైన్డ్ భూమి ఉండగా, ఆ రైతులు వారి పట్టా భూముల్లో వ్యవసాయం చేసుకుంటే, మిగిలి ఉన్న భూములను పశుగ్రాసం కోసం కంచెగా మార్చుకున్నారు. దీనివల్ల 173 సర్వే నంబర్ పూర్తిగా కంచె భూములుగా కాలక్రమేణా పేరు వచ్చింది. ఆ కంచె భూములు కూడా అసైన్డ్ భూములని 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంతో అసలైన భూయజమానులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. చిన్న చిన్న పొరపాట్లతో అసలైన పట్టాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అన్నారంలో 261/1 భూములు కూడా 22ఏ జాబితాలోకి..
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని అన్నారం 261 సర్వేనంబర్ ప్రభుత్వ, అసైన్మెంట్ భూముల్లో గతంలో ప్రభుత్వం 117 మంది పేదరైతులకు అసైన్డ్ పట్టాలు అందజేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టీజీఐఐసీ కోసం 66 ఎకరాలు స్వాధీనం చేసుకోవడానికి ప్రాథమిక నోటీసులు జారీ చేసింది. ఇది కాక 261/1లో ఉన్న అసైన్డ్ పట్టాలను ఆధారంగా చేసుకుని 261/24 బై నంబర్లలో ఉన్న 15 ఎకరాల భూమిని కూడా 22ఏ నిషేధిత జాబితాలోకి తేవడంతో అసలైన భూయజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈవిషయంపై పలువురు రైతులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 22ఏ తెచ్చి రైతుల నుంచి పైసా వసూల్ చేయడానికి ప్రజలపై భారం మోపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే క్షేత్రస్థాయిలో రెవెన్యూ రికార్డులను పరిశీలించి, అసలైన భూయజమానులను గుర్తించి రెవెన్యూ రికార్డులను 22ఏ జాబితాలో ఉన్న సర్వే నంబర్లను తొలిగించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రభుత్వం తీరుపై పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు.