సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 14: సంగారెడ్డి జిల్లాలో గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఆది,సోమవారం జరిగే గ్రూప్-2 పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై ఇప్పటికే జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సమీక్షించారు. ఈ పరీక్షలు ఓఎంఆర్ పద్ధ్దతిలో నిర్వహిస్తారు. జిల్లాలో 41 కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో మొత్తం 15,218 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానుండగా, ఆదివారం (నేడు) ఉదయం 10 నుంచి మధ్యాహం 12.30 గంటల వరకు పేపర్-1, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుంది. సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహం 12.30 గంటల వరకు పేపర్-3, మధ్యా హ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు పేపర్ -4 పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు.
అభ్యర్థులకు అవసరమైన వసతులను పరీక్షా కేంద్రాల్లో కల్పించామని, దివ్యాంగ అభ్యర్థుల కోసం వీల్ చైర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షా సమయానికి అరగంట ముందే గేట్లు మూసివేయనున్నట్టు కలెక్టర్ స్పష్టం చేశారు. అభ్యర్థులు నలుపు లేదా నీలం బాల్ పాయింట్ పెన్ను, పెన్సిల్, ఎరేజర్, హాల్ టికెట్‌పై ఫొటో అతికించుకుని, ప్రభుత్వం జారీచేసిన ఏదైనా చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ ఫొటోఐడీతో పరీక్షకు హాజరు కావాలని సూచించారు. అన్ని సమాధానాలు బాల్ పాయింట్ పెన్నుతో మాత్రమే రాయాలని, పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఏఎన్ఎంలు, ప్రథమ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచామని, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
పరీక్షా కేంద్రాల్లో వైద్యారోగ్య సేవలు
సిద్దిపేట కమాన్, డిసెంబర్ 14: గ్రూప్ -2 పరీక్షా కేంద్రాల వద్ద వైద్యారోగ్య శాఖ సిబ్బంది ద్వారా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని డీఎంహెచ్‌వో పల్వన్ కుమార్ తెలిపారు. ఆది, సోమవారాల్లో నిర్వహించే గ్రూప్-2 పరీక్ష కేంద్రాల్లో (ఫస్ట్ ఎయిడ్ కిట్స్) వైద్యారోగ్య శాఖ అత్యవసర మందులతో 37 పరీక్ష కేంద్రాల్లో ఉన్నారని, ఎలాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.