సంగారెడ్డి కలెక్టరేట్, జూన్ 9: జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా ముగిసింది. ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించగా, రెండు, మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను అధికారులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. జిల్లాలో మొత్తం 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, పలు పరీక్షా కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి కలెక్టర్ వల్లూరు క్రాంతి సందర్శించి పరిశీలించారు. మొత్తం 9672 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా, 7530 మంది హాజరయ్యారు. 2142 మంది అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. దీంతో 77.85 శాతం హాజరు నమోదైంది. స్థానిక సేయింట్ ఆంథోనీస్ పాఠశాల కేంద్రంలో ఐదుగురు అభ్యర్థులు రెండు నిమిషాలు ఆలస్యంగా రావడంతో పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. దీంతో చేసేదేమీ లేక వారు వెనుదిరిగి వెళ్లారు. జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేయగా ఎక్కడా ఎలాం టి ఇబ్బందులు తలెత్తలేదు. ఈ సందర్భంగా సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగిందని తెలిపారు.
సిద్దిపేట అర్బన్, జూన్ 9: సిద్దిపేట జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష సజావుగా ముగిసింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని 21 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు 8,230 మంది అభ్యర్థులకు 6705 మంది హాజరై 81.38 హాజరు శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పలు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ మనుచౌదరి పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో వసతులు, సెక్యూరిటీ ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా ముగిసిందన్నారు. మొత్తం 8,230 మంది అభ్యర్థులకు 6,705 మంది అభ్యర్థులు హాజరై 1534 మంది గైర్హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్, గ్రూప్-1 ప్రిలిమ్స్ నోడల్ అధికారి గరీమాఅగర్వాల్ పలు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుం డా సిద్దిపేట సీపీ అనురాధ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.