సంగారెడ్డి మే 7(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి భూగర్భజలమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం భూగర్భజలాలు పాతాళానికి చేరుకుంటున్నాయి. భూగర్భజలశాఖ ప్రతినెలా భూగర్భజలమట్టాలను సేకరిస్తుంది. భూగర్భజలశాఖ నివేదిక అనుసరించి గతనెల చివరి వరకు సంగారెడ్డి జిల్లాలో భూగర్భజలమట్టాలు 15.47 మీటర్లకు చేరుకున్నాయి.
ఫిబ్రవరిలో 12.57 మీటర్లు లోతులో ఉండగా మార్చిలో 14.79 మీటర్లకు పడిపోయాయి. గతేడాది ఏప్రిల్‌తో పోల్చి చూస్తే జిల్లాలో 1.97 మీటర్ల లోతుకు భూగర్భజలాలు తగ్గుముఖం పట్టాయి. భూగర్భజలాలు తగ్గుముఖం పట్టడంతో జిల్లాలో తాగు, సాగునీటి ఇబ్బందులు పెరుగుతున్నాయి. భూగర్భజలమట్టాలు తగ్గడంతో వ్యవసాయబోర్లు సాగునీటిని ఆశించిన స్థాయిలో పోయడంలేదు. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, అందోలు, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టడంతో వ్యవసాయబోర్ల నుంచి తక్కువగా నీళ్లు వస్తున్నాయి.
దీంతో పంటలకు సాగునీరు సరిపోక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కూరగాయలసాగు చేస్తు న్న రైతులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూగర్భ జలమట్టాలు తగ్గటంతో తాగునీటి బోర్లు ఎండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తక్కువగా నీళ్లు పోస్తున్నాయి. దీంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని చాలా గ్రామాలు, తండాల్లో మిషన్ భగీరథ నీరు సరఫరా కావడంలేదు. దీనికితోడు గ్రామంలోని తాగునీరు సరఫరా చేసే బోర్ల నుంచి నీళ్లు రావటం లేదు. భూగర్భజలాలు పడిపోతున్న నేపథ్యంలో రైతులు కొత్త బోర్లు వేసేందుకు జంకుతున్నారు.
కంగ్టి మండలంలో…
సంగారెడ్డి జిల్లాలోని కంగ్టి మండలంలో (అత్యంత లోతుకు) భూగర్భజలాలు 27.78 మీటర్లకు చేరుకున్నాయి. హ త్నూర మండలంలో భూగర్భ జలమట్టాలు 24.30 మీటర్లు, నిజాంపేటలో 22.16, కల్హేర్‌లో 21.65, కొండాపూర్‌లోని ఆర్సీపురంలో 19.27, సంగారెడ్డిలో 18.64, గుమ్మడిదలలో 17.83, పటాన్చెరులో 17.68, చౌటకూరులో 16.95, పుల్కల్లో 15.53 మీటర్లలోతులో భూగర్భ జలమట్టాలు ఉన్నాయి.
జహీరాబాద్ మండలంలో 14.59 మీట ర్లు, కోహీర్‌లో 14.26, కందిలో 13. 83, అందోల్‌లో 13.52, మొగుడంపల్లి లో 13.19, జిన్నారంలో 13.03, సిర్గాపూర్‌లో 12.84, సదాశివపేటలో 11. 97, జిన్నారంలో 11.36, న్యాల్కల్లో 10.10, నాగల్గిద్దలో 8.19. మనూరులో 7.86, మునిపల్లిలో 7.70, రాయికోడ్‌లో 7.48, వట్పల్లిలో 7.64 మీటర్ల లోతులో భూగర్భ జలాలు ఉన్నాయి. రామచంద్రాపురం మండలంలో అత్యంత పైన 3.80 మీటర్లలో భూగర్భ జలాలు ఉన్నాయి. వేసవి నేపథ్యంలో మే చివరినాటికి భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోయే అవకాశం ఉంది.