కంది, ఫిబ్రవరి 3: సంగారెడ్డి జిల్లా కంది మండలం బేగంపేట గ్రామ కంఠం భూమిని కొందరు కబ్జా చేశారు. గ్రామంలోని వాటర్ ట్యాంక్ స్థలంలో అక్రమంగా గుంతలు తవ్వి ఇంటిని నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో తప్పుడు పత్రాలు సృష్టించి భూకబ్జాకు ప్రయత్నిస్తున్నారని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బేగంపేట గ్రామస్తులు డిమాండ్ చేశారు.
సోమవారం బీఆర్ఎస్ నాయకుడు సాయిగౌడ్ సమక్షంలో గ్రామస్తులు కలెక్టరేట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. కబ్జాకు గురవుతున్న వాటర్ ట్యాంక్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని, తప్పుడు పత్రాలు సృష్టించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌ను కోరారు.
ఈ సందర్భంగా సాయిగౌడ్ మాట్లాడుతూ.. బేగంపేట పంచాయతీ పరిధిలో వాటర్ ట్యాంక్ స్థలం ఉందని, ఈ స్థలం వాటర్ ట్యాంక్‌కు చెందినదేనని, పంచాయతీ సమావేశంలో తీర్మానం కూడా చేశామన్నారు. కొందరూ ఆ స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరారు. గతంలో కూడా భూకబ్జా విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చామని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో బేగంపేట గ్రామస్తులు శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్, రవి, శేఖర్, మల్లేశ్ ఉన్నారు.