మెదక్, మే 6 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో కురుస్తున్న అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్, మేలో అకాల వర్షాల కారణంగా సుమారు జిల్లాలో 680.20 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. భారీ వర్షాల వల్ల చేతికొచ్చిన పంట నేలరాలి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది.
రైతులు వరి పంట కోసిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించారు. ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో వర్షం కురుస్తుండడంతో రైతుల కష్టాలు చెప్పనలవికావు. ధాన్యంపైన కప్పడానికి టార్పాలిన్లు లేక రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడంలో ఆలస్యం కావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
సర్వే అంతంతమాత్రమే
ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు వ్యవసాయశాఖ, రెవెన్యూ సంయుక్తంగా సర్వేలు చేపట్టాయి. రైతులు సాగు చేసిన పంటల వివరాలు సేకరించింది. కేవలం ఎకరం వరి పొలంలో 33 శాతం నష్టం వాటిల్లితే నష్టపరిహారం పథకం వర్తించదని ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఎకరానికి 33 శాతం పంట నష్టపోయిన రైతులకు రూ.10వేల వరకు పరిహారం రావచ్చనే అంచనా వేస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే సర్వేలు చేసి నివేదికలను ప్రభుత్వానికి పంపించారు.
ఇంకా సర్వే చేయని మండలాల్లో సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు భరోసా కింద మూడు ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందింది. మిగతా రైతులకు రైతు భరోసా అందక పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వానకాలం పంటలు సాగు చేసే వరకైనా పంట నష్టపరిహారం పెట్టుబడి కోసం వస్తుందని రైతులు ఎదురుచూస్తున్నారు. అకాల వర్షాల వల్ల మెదక్ జిల్లాలో 540 మంది రైతులకు చెందిన 680 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఎకరానికి రూ.20 వేల పరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
సర్వే పూర్తి చేసి నివేదిక అందజేస్తాం
మెదక్ జిల్లాలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతుల పొలాల వద్దకు వెళ్లి సర్వే చేస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో 540 మంది రైతులకు చెందిన 680.20 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇంకా సర్వే చివరి దశలో ఉంది. కొన్ని మండలాల్లో సర్వేచేయాల్సి ఉంది. సర్వే పూర్తి చేసిన వెంటనే నివేదికను ప్రభుత్వానికి అందజేస్తాం. రైతులకు సాయం చేయడానికి కృషి చేస్తాం.
-వినయ్‌కుమార్, డీఏవో, మెదక్ జిల్లా