హుస్నాబాద్, మే 29: హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ధాన్యం కొనుగోళ్లు తుదిదశకు చేరుకున్నాయి. డివిజన్లోని ఆరు మండలాల్లో 80 శాతం కొనుగోళ్లను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. నెల రోజులు పాటు నిరంతరాయంగా కొనుగోళ్లు చేస్తూ అధికారులు రైతులకు అండగా నిలిచారు. డివిజన్లో ఏర్పాటు చేసిన 108ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ కూడారైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆర్డీవో జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రెవెన్యూతో పాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కొనుగోళ్లను సక్రమంగా జరిపించారు. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు పూర్తైన దగ్గర డివిజన్లో 10కొనుగోలు కేంద్రాలను అధికారులు మూసివేశారు. మిగతా కొనుగోలు కేంద్రాల్లో కేవలం 20 శాతం మాత్రమే వడ్లు ఉన్నాయని, వీటిని వారం లోపు కొనుగోలు చేసి వందశాతం పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు ఎలాంటి ఆటంకం లేకుండా జరగడంపై డివిజన్లోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
5,37,504 క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు పూర్తి
హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, ధూళిమిట్ట, మద్దూరు మండలాల్లో ఇప్పటి వరకు 5,37,504 క్వింటాళ్ల ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేశారు. ఇందులో కోహెడ మండలంలో అత్యధికంగా 1,26,522 క్వింటాళ్ల వడ్లు కొనుగోలు చేయగా అక్కన్నపేట మండలంలో 1,14,862 క్వింటాళ్లు, బెజ్జంకి మండలంలో 1,21,250 క్వింటాళ్లు, ధూళిమిట్టలో 38,937 క్వింటాళ్లు, హుస్నాబాద్‌లో 91,192 క్వింటాళ్లు, మద్దూరు మండలంలో 44,740 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. కొనుగోళ్లకు సరిపడా గన్నీ సంచులు అందుబాటులో ఉంచడం, తూకం వేసిన బస్తాలను వెంటనే రైస్ మిల్లులకు తరలించడంతో రైతులకు ఇబ్బందులు ఏర్పడలేదు.
విజయవంతంగా కొనుగోళ్లు
హుస్నాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన 108 కేంద్రాల్లో నిరాటంకంగా కొనుగోళ్లు జరుపుతున్నాం. రెవెన్యూ అధికారులు, సిబ్బందితో పాటు వ్యవసాయ, ఇతరశాఖల అధికారుల సహకారంతోనే డివిజన్లో విజయవంతంగా ధాన్యం సేకరిస్తున్నాం. 80శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయి. వారం రోజుల్లోపూ మరో 20శాతం పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కొనుగోళ్లు పూర్తయిన చోట కేంద్రాలను మూసివేస్తున్నాం. ధాన్యం విక్రయించిన రైతులకు ఎలాంటి జాప్యం లేకుండా డబ్బులు సకాలంలో వస్తున్నాయి. త్వరలోనే వందశాతం కొనుగోళ్లు పూర్తి చేస్తాం.
-జయచంద్రారెడ్డి, ఆర్డీవో, హుస్నాబాద్
రూ.105.35 కోట్ల చెల్లింపులు
డివిజన్లోని ఆరు మండలాలకు చెందిన 10,705 మంది రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించారు. అక్కన్నపేట మండలంలో 2,492 మంది రైతులు తమ ధాన్యాన్ని విక్రయించగా బెజ్జంకిలో 1,975 మంది, ధూళిమిట్టలో 859 మంది, హుస్నాబాద్‌లో 2,064 మంది, కోహెడలో 2,373 మంది, మద్దూరు మండలంలో 942 మంది రైతులు వడ్లను విక్రయించారు. వీరందరికీ కలిపి మొత్తం రూ105, 35,07, 840 ప్రభుత్వం
చెల్లించింది. ఈ మొత్తంలో ఇంకా కొంతమంది రైతుల ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి.