మెదక్, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో సెంటర్లకు ధాన్యం వస్తున్నా కొనుగోళ్లు ఇంకా ప్రారంభం కావడం లేదు. మెదక్ జిల్లాలో 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. పలుచోట్ల కేంద్రాలు ప్రారంభమైనా నిర్వాహకులు కొనుగోలుపై దృష్టి సారించడం లేదు. దీంతో అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రాలతో పాటు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో సెంటర్ల వద్ద సౌకర్యాలు కల్పించి, తేమ శాతం ఉన్న వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయాలని కోరుతున్నారు. పదిహేను రోజుల నుంచి కోతలు మొదలు కాగా.. అకాల వర్షాలను దృష్టిలో పెట్టుకొని కొంత మంది రైతులు ముందుగానే కోతలు కానిస్తున్నారు.
ఇప్పటికే జిల్లాలో వరి కోతలు జోరందుకున్నాయి. వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టే రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. అకడే మూడు నాలుగు రోజులు ఆరబోసి, ఇక కొంటారని ఎదురుచూస్తున్నారు. కొన్నిచోట్ల కోసిన ధాన్యాన్ని కల్లాల్లో ఎండబెట్టి విక్రయించేందుకు తెస్తే.. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక రైతులు నిరాశ చెందుతున్నారు. వారం క్రితమే పలు చోట్ల ప్రజాప్రతినిధులు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించినా కొనుగోళ్లు మొదలు కాక అకడే రైతులు పడిగాపులు కాస్తున్నారు. యాసంగి సీజన్లో మెదక్ జిల్లాలో 2,46,136 ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు.
ఇందులో దొడ్డు, సన్నరకం కలిపి 3,89,774 మెట్రిక్టన్నుల ధాన్యం సెంటర్లకు రానుందని అధికారులు అంచనా వేశారు. ఇందుకు జిల్లాలో 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాల శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో సన్నధాన్యం కోసం 90 కొనుగోలు కేంద్రాలు, దొడ్డు రకం కోసం 390 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో 324 కేంద్రాలు, డీసీఎంఎస్ 10 కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 127 కొనుగోలు కేంద్రాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో 19 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెలలో 371 కేంద్రాలు ప్రారంభించామని చెప్పారు. అయితే కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించినా ఎకడా కొనుగోళ్లు మాత్రం చేయడం లేదు. దీంతో రైతులకు నిరాశ తప్పడం లేదు.