సంగారెడ్డి, మే 15(నమస్తే తెలంగాణ): అకాల వర్షాలు వరి రైతు వెన్నువిరిచాయి. బుధవారం రాత్రి, గురువారం ఉదయం సంగారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు ధాన్యం తడిసిపోయి రైతులకు నష్టాన్ని మిగిల్చింది. చేలు, రహదారుల పక్కన రైతులు ఆరబోసిన ధాన్యం వర్షార్పణం అయ్యింది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆరబోసిన, బస్తాల్లోని ధాన్యం సైతం తడిసి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షానికి తోడు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించినా ధాన్యం భద్రపరిచేందుకు, తరలించేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
దీనికితోడు కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చిన రైతులకు టార్పాలిన్లు, గన్నీబ్యాగులు సమకూర్చడంలో అధికారులు విఫలమయ్యారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే మిల్లులకు తరలించక పోవడంతో ధాన్యం వర్షానికి పెద్ద ఎత్తున తడిసిపోయింది. తడిసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించకపోతే మొలకెత్తే అవకాశం ఉంది. ఇదే జరిగితే రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒకటి రెండురోజుల్లో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం అంతా మిల్లులకు తరలించే అవకాశాలు కనిపించడం లేదు. ట్రాన్స్‌పోర్టు సమస్య సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా ఉంది.
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ప్రతిరోజూ వాహనాలు రావడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. తిరిగి వర్షాలు కురిసిన పక్షంలో మరింత ధాన్యం తడిసి రైతులకు నష్టం మిగిలే ప్రమాదం పొంచి ఉంది. బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గురువారం కొండాపూర్ మండలంలో పర్యటించి తడిసిన ధాన్యం, మొక్కజొన్నలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ చౌటకూరు మండలంలో తడిసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.
సంగారెడ్డి జిల్లాలో బుధవారం రాత్రి, గురువారం ఉదయం భారీగా వర్షం కురిసింది. జిల్లాలో మొత్తం 2.9 సెం.మీటర్ల సాధారణ వర్షం పాతం నమోదైంది. పుల్కల్ మండలంలో అత్యధికంగా 7.9 సెం.మీటర్ల వర్షం కురిసింది. రెండు మండలాల్లో అత్యధిక వర్షం కురవగా, 12 మండలాల్లో సాధారణం కంటే 50 శాతం అధికంగా వర్షం కురిసింది. కోహీర్‌లో 7.3 సెం.మీటర్లు, సదాశివపేటలో 5.9, కొండాపూర్‌లో 5.8, జిన్నారంలో 4.7, చౌటకూరులో 4.6,గుమ్మడిదలలో 4.3 సెం. మీటర్ల వర్షం కురిసింది. మిగతా మండలాల్లో 4 నుంచి 2 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది.
సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదైంది. భారీగా కురిసిన వర్షాలతో ఆరబోసిన ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. అందోలు మండలం అల్లాయిపేటలో వర్షానికి చేలలో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. రోడ్డుపక్కన ఆరబోసిన ధాన్యం వర్షం నీటికి కొట్టుకుపోయింది. టార్పాలిన్లు లేకపోవటంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉంచిన ధాన్యం తడిసిపోయింది. అల్మాయిపేటలో సుమారు 20 నుంచి 30 క్వింటాళ్ల ధాన్యం తడిసింది. నేరేడిగుంట కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన ధాన్యంతోపాటు మిల్లుకు తరలించే ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. చింతకుంటలోని కొనుగోలు కేంద్రం వద్ద సుమారు 20 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది.
అందోలు పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద వర్షానికి 30 క్వింటాళ్ల ధాన్యం తడిసింది. చౌటకూరు మండలంలోని కోర్పొల్ కొనుగోలు కేం ద్రంలో 800 ధాన్యం బస్తాలు, చౌటకూరులో 1600, చక్రియాల్‌లో 400, గంగోజిపేట 250 బస్తాల ధాన్యం తడిసిపోయింది. తాడ్దాన్పల్లి, బద్రిగూడెం, ఉప్పరిగూడెంలో సుమారు 200 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయినట్లు రైతులు తెలిపారు. పుల్కల్ మండలంలోని పుల్కల్, గొంగ్లూరు గ్రామాల్లో వర్షానికి సుమారు 1200 క్వింటాళ్ల వరకు ధాన్యం తడిచిపోయింది.
రైతులకు అవసరమైన టార్పాలిన్లు సమకూర్చక పోవడం, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం బస్తాలను తరలించక పోవడంతో వర్షానికి ధాన్యం తడిసి రైతులకు నష్టాన్ని మిగిల్చింది. సంగారెడ్డి మండలంలోని ఇస్మాయిల్‌ఖాన్‌పేట, కల్పగురు తదితర గ్రామాల్లో ధాన్యం తడిసిపోయింది. కంది గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో మిల్లులకు తరలించాల్సిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయి. సదాశివపేట మండలంలోని కొల్లూరు గ్రామంలో సుమారు 20 క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. కొండాపూర్ మండలంలోని సీహెచ్ కొనాపూర్‌లో మొక్కజొన్న పంట వర్షానికి తడిసిపోయింది.
గ్రామంలోని చేలల్లో ఆరబోసిన మొక్కజొన్న పంట పూర్తిగా వర్షానికి తడిసిపోయి రైతులకు అపార నష్టం మిగిల్చింది. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సీహెచ్ కొనాపూర్ గ్రామాన్ని సందర్శించి పంట నష్టపోయిన రైతులను కలిసి నష్టం వివరాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని రైతులకు హామీ ఇచ్చారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సైతం ధాన్యం వర్షానికి తడిసిపోయింది. ధాన్యం తడిసిపోవటంతో రైతులు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తరలింపులో నిర్లక్ష్యం కారణంగానే వర్షాలకు ధాన్యం తడిసిపోయి నష్టం చవిచూడాల్సి వస్తున్నదని రైతులు వాపోతున్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మండిపడ్డారు. కొండాపూర్ మండలం సీహెచ్ కోనాపూర్‌లో తడిసిన ధాన్యం, మొక్కజొన్నలను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అకాల వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో వరి, మొక్కజొన్న, జొన్న రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు చెప్పారు. వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొండాపూర్ మండలంలో ధాన్యం, మొక్కజొన్నలను పరిశీలించిన అనంతరం అక్కడి నుంచి కలెక్టర్ వల్లూరు క్రాంతితో ఫోన్లో మాట్లాడారు. రైతులకు పరిహారం చెల్లించడంతో పాటు తడిసిన ధాన్యం, మొక్కజొన్న, జొన్నలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
– చింతా ప్రభాకర్, సంగారెడ్డి ఎమ్మెల్యే