సిద్దిపేట, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పాలనలో రైతులకు చేయూత కరువైంది. ఎన్నికల్లో రైతులకు అనేక హామీలిచ్చిన కాంగ్రెస్, గద్దెనెక్కిన తర్వాత మొండిచేయి చూపుతున్నది. రైతులు పండించిన అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి తీరా షరతులు, కొర్రీలు పెట్టి అన్యాయం చేసింది. వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి తీరా సన్నవడ్లకు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సన్నవడ్లు అమ్మి రెండు నెలలు గడుస్తున్నా రైతులకు బోనస్ మాత్రం రావడం లేదు. సిద్దిపేట జిల్లాలో రూ. 1.08 కోట్లు, మెదక్ జిల్లాలో రూ. 1.20 కోట్లు ఉమ్మడి జిల్లాలో మొత్తం రూ. 2.28 కోట్లు బోనస్ డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ డబ్బులు ఎప్పుడూ వేస్తారా అని రైతులు ఎదురు చూస్తున్నారు.
సిద్దిపేట జిల్లాలో 2,669 మంది రైతుల నుంచి 9,679 క్వింటాళ్ల సన్న వడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీని ఎంఎస్పీ రూ.27.29 కోట్లు కాగా, బోనస్ డబ్బులు రూ. 4.83 కోట్లు. ఇప్పటి వరకు 2,020 మంది రైతులకు 7,509 క్వింటాళ్లకు సంబంధించిన ఎంఎస్పీ డబ్బులు రూ. 27.29 కోట్లు చెల్లించారు. బోనస్‌కు సంబంధించిన రూ.3.75 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ. 1.08 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంది.
మెదక్ జిల్లాలో 53,660 మెట్రిక్ టన్నుల ధాన్యంను 12,872 మంది రైతుల వద్ద కొనుగోలు చేశారు.ఇప్పటి వరకు క్వింటాల్‌కు రూ. 500 చొప్పున 12,577 మంది రైతులకు రూ.124.49 కోట్లు చెల్లించగా, ఇంకా 495 మంది రైతులకు సంబంధించి రూ. 1.20 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లాలో 447 మంది రైతుల నుంచి 2,940 క్వింటాళ్ల సన్నవడ్లను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ జిల్లాలో ఇంకా కొంత మంది రైతులకు బోనస్ రావాల్సి ఉంది. బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేసింది. కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వేస్తామని చెప్పింది. కానీ, 50 రోజులు దాటినా సన్నవడ్ల బోనస్ డబ్బులు జమ కాలేదని రైతులు చెబుతున్నారు. బోనస్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ తుంగలో తొక్కింది. పంట రుణమాఫీ సంపూర్ణంగా చేయలేదు. రైతుభరోసా వేయడం లేదు. కంది రైతులను దగా చేస్తున్నది. అనేక ఆంక్షలు పెడుతున్నది. పంట చేతికి వచ్చినా పొద్దు తిరుగుడు కొనుగోలు కేంద్రాలను ఇంత వరకు ప్రారంభించలేదు. ఆ పంటను ఎక్కడ అమ్ముకోవాలో రైతులు ఆందోళన చెందుతున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి సన్న వడ్లకు బోనస్ ఇస్తమంటే సంతోషపడ్డ. సీఎం హామీతో దొడ్డు వడ్లకు బదులు సన్నాలు పెట్టిన. దొడ్డు వడ్ల కంటే సన్నాల దిగుబడి పది క్వింటాళ్లు తక్కువ వచ్చింది. సీఎం చెప్పిన బోనస్ మాత్రం ఇప్పటికీ రాకపాయే. 40క్వింటాళ్ల సన్నాలు అమ్మిన. నాకు సర్కార్ నుంచి రూ. 20వేల వరకు బోనస్ రావాలే. రైతుల కిస్తమన్న బోనస్ ముచ్చటను సర్కార్ మర్సిపోయినట్లుంది. బోనస్ కోసం ఎదురు చూస్తున్నం.
– సిరిమల్ల భాస్కర్, రైతు, లింగాపూర్ (ధూళిమిట్ట మండలం)
కొమురవెల్లి, ఫిబ్రవరి 10: ప్రభుత్వం సన్నవడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తానంటే మురిసినం. గి పెట్టుబడి మొత్తం అడికాడికైనా ప్రభుత్వం ఇచ్చే బోనస్ లాభం వస్తుందనుకున్నా. వొడ్లు కాంట పెట్టి 3 నెలలు కావస్తున్నది. మళ్ల పంట కూడా చేతికొచ్చే సమయమైంది. గింత వరకు గా బోనస్ పడనేలేదు. బోనస్ గురించి ఎవర్ని అడగాలో తెలుస్తలేదు. తోటోళ్ల లెక్క నేను దొడ్డు బియ్యం పండించినా బాగుండే. సన్నవొడ్లు పెడితే దిగుబాడి తక్కువొచ్చే ప్రభుత్వం బోనస్ ఇయ్యకపాయే. పని చేసుకొని బతుకే మా లాంటోళ్లతో అబద్ధాలెందుకు చెప్పాలి. బోనస్ పేరిట సన్నవొడ్లు పెట్టి మోసపోయినం.
– పచ్చిమడ్ల ఐలేని, రైతు, రసూలాబాద్
మిరుదొడ్డి, ఫిబ్రవరి 10: ఇప్పటి వరకు బోనస్ పైసలు ఒక్క రూపాయి ఖాతాల పడలేదు. ఎన్నికప్పుడు క్వింటాల్ వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెసోళ్లు చెప్పిర్రు. ఇప్పుడేమో ఏమి ఇవ్వడం లేదు. రైతులను మోసం చేస్తుండ్రు. గీ కాంగ్రెస్ సర్కారు రైతుల సంక్షేమాన్ని పట్టించుకుంట లేదు. రైతుభరోసా ఇవ్వడం లేదు. గిట్లయితే రైతులం ఎట్ల పంటలు పండించాలి.
– దార కృష్ణయ్య, రైతు, మిరుదొడ్డి