ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తామని ప్రకటించిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) ఉద్యోగులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నది. అర్హులందరికీ ఆరోగ్య భద్రత కల్పిస్తామని గొప్పగా ప్రకటించిన ప్రభుత్వం, ఆచరణలో మాత్రం సరిగా అమలు చేయడం లేదని ఆరంభంలోనే విమర్శలు వెలువెత్తున్నాయి. దీంతో వేతనాల్లో కోత విధించారు….డిజిటల్ హెల్త్‌కార్డులు ఇవ్వడం మరిచారు…?హెల్త్ కార్డుల జారీలో జాప్యం ఎందుకు అంటూ పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
అందోల్, జూన్ 14 : ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆరోగ్య భద్రత గాలిలో దీపంలా మారిందని ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 2 నుంచే కార్పొరేట్ దవాఖానల్లో రగదు రహిత వైద్యం ఉంటుందని ప్రకటించిన ప్ర భుత్వం, అందుకోసం ఉద్యోగుల జీతాల్లో నుంచి మే నెలలో 1.5 శాతం కోత విధించింది. ఇంత వరకు బాగా నే ఉన్నా, ముందస్తుగా చందాను కట్‌చేసుకున్న ప్రభు త్వం వారికి డిజిటల్ హెల్త్‌కార్డులు అందించలేదు.
దీం తో నాణ్యమైన వైద్య సేవలు సరిగా అందక, నగదు చెల్లిస్తేనే చికిత్స అందిస్తుండడంతో ఆరోగ్య భద్రతపై ఉద్యో గ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆందోళన చెందుతున్నా రు. ఈహెచ్ఎస్ అమలుపై ప్రభుత్వం ఇప్పటికీ విధివిధానాలు, దవాఖానల వివరాలు ప్రకటించలేదు దీం తో అత్యవసర చికిత్స అవసరమైతే డబ్బులు చెల్లించి చికిత్స పొందుతన్నారు ఉద్యోగులు. ప్రభుత్వం, దవాఖానల యాజమాన్యాల మధ్య సమన్వయం లేకపోవడం, సరైన మార్గదర్శకాలు ఇవ్వకపోవడం, పాతబకాయిలు చెల్లించని కారణాలతో నగదు చెల్లిస్తేనే వైద్యం అందిస్తామని అటు పాత హెల్త్‌కార్డులను సైతం తిరస్కరిస్తున్నాయి కొన్ని దవాఖానలు. తప్పని పరిస్థితిలో అప్పులు చేసి బిల్లులు చెల్లించామని, ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్య భద్రత అమలు ఏమైందని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగుల వేతనాల నుంచి చందాలు వసూలు చేసినంతా వేగం, డిజిటల్ హెల్త్‌కార్డుల పంపిణీ, ఆరోగ్య సేవలు అందించడంలో కనిపించడం లేదని ఉద్యోగులు మండి పడుతున్నారు. దవాఖానల యాజమాన్యాలు మాత్రం ఈహెచ్ఎస్పై తమకు ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని, అలాంటప్పుడు ఎలా ముందుకు వెళ్తామంటున్నారని పలువురు. ఈ విషయంపై జిల్లా నుంచి ప్రా తినిధ్యం వహిస్తున్న వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించి ఉద్యోగులకు ఆరో గ్య భద్రత కల్పించాలని, లేదంటే ఆరోగ్య భద్రతకోసం ఉద్యమించాల్సి వస్తుందని ఉద్యోగులు, ఉపాధ్యాయు లు, పెన్షనర్లు హెచ్చరిస్తున్నారు.
డిజిటల్ హెల్త్‌కార్డుల జా రీలో జాప్యం సరికాదు. జూన్ 2 నుంచే ఉద్యోగ, ఉపాధ్యా య, పెన్షనర్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ, నగదు రహిత వైద్యం క్షేత్రస్థాయిలో కనిపించడంలేదు. ఉద్యోగుల జీతాల్లో నుంచి కోత విధించినంత వేగంగా ఆరోగ్య భద్రత విషయంలో వేగం కనిపించడం లేదు. ప్రభుత్వం ఈహెచ్ఎస్ స్కీమ్‌పై సరైన దృష్టిపెట్టకపోవడంతో తీవ్ర గందగోళానికి, అనిశ్చితి పరిస్థితులు ఉన్నాయి. కొత్త ఆరోగ్యభద్రత అమలుకాక.. పాత కార్డులు దవాఖానల్లో చెల్లక డబ్బులు చెల్లించి చికిత్సలు పొంది ఆర్థికంగా చితికిపోయి అప్పుల పాలవుతున్నారు. ప్రభు త్వం వెంటనే స్పందించి డిజిటల్ హెల్త్‌కార్డులు వచ్చేవరకు పాత హెల్త్‌కార్డులు పూర్తిస్థాయిలో చెల్లుబాటు అయ్యేలా, వందశాతం నగదు రహిత వైద్యం అందేలా ఉత్తర్వులు జారీచేయాలి. జూన్ 2 తర్వాత సొంతంగా వైద్య ఖర్చులు భరించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రీయింబర్స్మెంట్ చెల్లించాలి. వీలైనంత త్వరగా ఈహెచ్ఎస్ అమలులో ఉన్న సాంకేతిక, ప రిపాలన సమస్యలను పరిష్కరించాలి.
-మాణయ్య, పీఆర్టీయూ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు