దుబ్బాక, జనవరి 27: సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. కాంగ్రెస్ సర్కారులో సాగునీటి కోసం రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. తలాపునా మల్లన్నసాగర్ ఉన్నప్పటికీ సాగునీరు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అక్బర్పేట-భూంపల్లి మండలం బొప్పాపూర్ రైతులు ఆందోళనకు దిగారు. కూడవెల్లి వాగు పరిసర ప్రాంతమైన బొప్పాపూర్ రైతులు సోమవారం సాగునీటి కోసం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నిరసన చేపట్టిన రైతులకు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అండగా నిలిచి ధర్నాలో పాల్గొన్నారు. కూడవెల్లివాగులో నీరు అడుగంటిపోవడంతో పంట పొలాలకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సర్కారులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కూడవెల్లి వాగు జలకళ సంతరించుకున్నదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారులో వాగులోకి నీరు విడుదల చేయక వెలవెల బోతున్నదని, వేసిన పంట పొలాలు ఎండుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.
నంగునూరు, జనవరి 27: రంగనాయకసాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరుతూ మండలంలోని అక్కెనపల్లికి చెందిన సుమారు వంద మంది రైతులు సోమవారం ఇరిగేషన్ శాఖ ఈఈ గోపాలకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మరికొద్ది రోజుల్లో నీటిని విడుదల చేయకపోతే పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి వస్తుందన్నారు. అధికారులు స్పందించి వెంటనే కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని రైతులు కోరారు.
ఈ విషయంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు సైతం స్పందించారని.. వెంటనే ఇరిగేషన్ అధికారులకు ఫోన్ ద్వారా తమ పరిస్థితిని తెలియజేశారన్నారు. ఇరిగేషన్ అధికారులు ఫిబ్రవరి మొదటి వారంలో నీటిని విడుదల చేస్తామని చెప్పారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆయిల్‌పామ్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు ఎడ్ల సోమిరెడ్డి, అక్కెనపల్లి రైతులు నాగేందర్, సుధాకర్, శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి, నారాయణరెడ్డి, వెంకటేశ్‌గౌడ్, యాదగిరి పాల్గొన్నారు.