రామాయంపేట, జూలై 8 : మూడేండ్ల నుంచి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం మెదక్ జిల్లా రామాయంపేటకు వచ్చిన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్, అండర్‌పాస్ నిర్మించి ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
ఐదు నెలల్లో జరిగిన 45 ప్రమాదాల్లో 35 మంది మృతిచెందారన్నారు. రామాయంపేట హైవే దాటేందుకు వాహనదారులు నానా తంటాలు పడుతున్నారని మండిపడ్డారు. వాహనాలు వేగంగా రావడంతో రోడ్డు దాటడం ప్రజలకు కష్టంగా మారిందన్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు ప్రజలకు కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానికులతో కలిసి ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే హైవేను దిగ్బం ధం చేస్తామన్నారు.
జాతీయ రహదారి విషయమై మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్‌ను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలిసి బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. తక్షణమే రామాయంపేట బైపాస్ వద్ద అండర్‌పాస్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ మెదక్ మున్సిపల్ చైర్మన్లు బట్టి జగపతి, మల్లికార్జున్‌గౌడ్, చౌదరి సుప్రభాతరావు. పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, బసన్నపల్లి మల్లేశం, రాజుయాదవ్, రామాయంపేట కౌన్సిలర్లు కొక్కు ప్రవీణ్, చౌదరి చరిత, నాయకులు మద్దెల రమేశ్, పరుపాటి సుధాకర్‌రెడ్డి, ఎస్కే. హైమద్, భాను, ఎండీ.అస్నొద్దీన్, శ్రీనివాస్, అల్లాడి వెంకటేశం, వినయ్‌సాగర్, మధుకర్ పాల్గొన్నారు.