
మెదక్, జనవరి 11 : శిశు మరణాల నివారణే లక్ష్యంగా రాష్ట్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చి, వైద్యులు, సిబ్బందిని పెద్ద ఎత్తున నియమిస్తున్నది. ప్రధానంగా గర్భిణులకు మెరుగైన సేవలు అందించి, సాధారణ ప్రసవాలు చేసి, అనంతరం కేసీఆర్ కిట్ అందిస్తున్నది. అప్పుడే పుట్టిన బిడ్డ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడితే రక్షణ కల్పించేందుకు నవజాత శిశు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలోనూ ఈ సౌకర్యాలన్నీ అందుబాటులో ఉండడంతో వేలాది మంది గర్భిణులు సేవలు వినియోగించుకుంటున్నారు. మెదక్ జిల్లాతో పాటు ఇక్కడ ఇటుక బట్టీల్లో పనిచేసేందుకు వచ్చిన మహారాష్ట్ర కూలీలు, కామారెడ్డి జిల్లా సరిహద్దు గ్రామాలకు చెందిన వారు కూడా ప్రసవ సేవలు పొందుతున్నారు.
ప్రత్యేక నవజాత శిశు కేంద్రం..
తల్లి గర్భం నుంచి శిశువు బయటకు రాగానే వాతావరణం తట్టుకునేలా వెచ్చదనాన్నిచ్చే ఇంక్యుబేటర్‌లో ఉంచుతారు. పసిరికలు వస్తే ఫొటోథెరపీ ద్వారా నయం చేస్తున్నారు. పిల్లలకు దమ్ము వచ్చినైట్లెతే ఆక్సిజన్ అందిస్తారు. నవజాత శిశు కేంద్రంలో చిన్నారులకు సేవలు అందించడంలో వైద్యులు, నర్సులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. మెదక్ జిల్లా కేంద్రం దవాఖానలోని నవజాత శిశు కేంద్ర ల్యాబరేటరీలో శిశువులకు సంబంధించిన రక్త పరీక్షల నిర్ధారణ కోసం నమూనాలను సేకరించి స్థానిక ప్రభుత్వ డయాగ్నస్టిక్ హబ్‌కు పంపిస్తారు. ఐసీటీసీ కేంద్రంలో గర్భవతులకు హెచ్ఐవీ టెస్ట్‌లు చేస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు ఇక్కడే కరోనా టీకాలు ఇస్తున్నారు.
రూ.54 లక్షలతో ప్రత్యేక కేంద్రం..
మెదక్ జిల్లాకేంద్ర దవాఖానలో రూ.54 లక్షలతో ప్రత్యేక నవజాత శిశు కేంద్రాన్ని ఈనెల 8న స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు. ఎన్హెచ్ఎం నిధులతో అత్యాధునిక హంగులతో ఈ భవనాన్ని నిర్మించారు. అప్పుడే జన్మించిన నవజాత శిశువును ఇంక్యుబేటర్‌లో ఉంచుతారు. ఎప్పటికప్పుడు శిశువు గుండె చప్పుడు స్కానింగ్, వెచ్చదనం ఇచ్చే పరికరాలతో పాటు ఆపరేషన్‌కు అవసరమైన సామగ్రి అందుబాటులో ఉండడంతో ప్రసవాలు జరపడానికి సౌకర్యవంతంగా ఉంది.
స్కానింగ్‌తో నిర్ధారణ..
గర్భస్త్ర శిశువు ఎదుగుదల, గుండెచప్పుడు, శ్వాస తీరు, ఎన్ని నెలలు వయస్సు వంటివి స్కానింగ్ చేసి నిర్ధారణ చేస్తారు. రేడియాలజిస్ట్ నిర్ధారణ చేసి నివేదికను అందజేస్తారు. మూడు, తొమ్మిది నెలల సమయంలో శిశువు స్థితిగతులను ఇక్కడే పరిశీలిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. గతంలో గర్భిణులను స్కానింగ్ కోసం ప్రైవేట్ దవాఖానలకు పంపేవారు. కానీ, ప్రస్తుతం ఇక్కడే స్కానింగ్ చేస్తుండడంతో గర్భిణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మెరుగైన సేవలు అందిస్తున్నాం..
మెదక్ జిల్లా కేంద్ర దవాఖానకు వచ్చే గర్భిణులు, ఇతర రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దవాఖానలో అన్ని సౌకర్యాలు కల్పించింది. మెదక్ జిల్లానే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన వారు కూడా వైద్యం కోసం వస్తున్నారు. ప్రత్యేక నవజాత శిశు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. శిశువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలందిస్తున్నాం.
సీఎం కేసీఆర్ కృషితో మెరుగైన వైద్యం..
తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లా దవాఖానతో పాటు అన్ని పీహెచ్‌సీల్లో పేదలకు మెరుగైన వైద్యం అందుతోంది. జిల్లా దవాఖానలోనే అత్యాధునిక పరికరాలతో అన్ని సౌకర్యాలు కల్పించాం. ఇప్పటికే డయాగ్నస్టిక్ హబ్‌తో పాటు ఐసీయూ, డయాలిసిస్ కేంద్రం, వార్డులను ఏర్పాటు చేశాం. వైద్యులతో పాటు నర్సులు, కింది స్థాయి ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలి. రూ. 54లక్షలతో ప్రత్యేక నవజాత శిశు కేంద్రాన్ని మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్, వైద్యఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు.