జిన్నారం, మే 30: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని రాళ్లకత్వలో సర్వేనంబర్ 286లో ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొందరు రైతులకు అసైన్డ్ భూము లు ఉన్నాయి. గతంలో కంకర క్రషర్కు కేటాయించారు. ప్రస్తుతం అక్కడ క్రషర్ నడవడం లేదు. రైతుల భూములు, క్రషర్ కోసం గుట్టలుగా పోసిన మట్టిని ఐదు నెలలుగా టిప్పర్లలో రాత్రిపూట తరలిస్తున్నారు. రాళ్లకత్వ, శివనగర్ గ్రామానికి చెందిన కొందరు టీంగా ఏర్పడి ప్రభుత్వ భూమిలోంచి దర్జాగా మట్టిని తవ్వి తరలిస్తున్నారు. రోజుకు దాదాపు వంద టిప్పర్లకు పైగా మట్టి తరలుతోంది. మూడు ఇటాచీలతో వేగంగా తవ్వకాలు జరుపుతున్నారు. రాళ్లకత్వ కంకర క్రషర్ వద్ద ఇటాచీలు, జనరేటర్, టిప్పర్లు ఉన్నాయి.
మట్టి తవ్వకాలు జరిపిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన మీడియాకు అవి కనిపించాయి. ఆర్అండ్బీ రోడ్డు ఎక్కకుండానే టిప్పర్లను శివనగర్ చెరువులోంచి తరలిస్తున్నారు. దీంతో ఎవరికి మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. మండలానికి చెందిన ఓ నాయకుడు అక్రమ మట్టి తవ్వకాల వెనుక ఉన్నారని, అందుకే రెవెన్యూ అధికారులు చర్యలకు వెనుకాడుతున్నారని రెండు గ్రామాలకు చెందిన పలువురు ఆరోపించారు.
రాళ్లకత్వ ప్రభుత్వ భూమిలోంచి జరుగుతున్న అక్ర మ మట్టి తవ్వకాలపై ఏప్రిల్ 13న ‘యథేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితం అయ్యింది. ఈ కథనంతో రెవెన్యూ అధికారులు హడావిడి చేసి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రెండు రోజుల క్రితం రాళ్లకత్వ గ్రామంలో మట్టి తవ్వకాలను గ్రామస్తులు అడ్డుకోవడంతో ఘర్షణ జరిగింది. దీనిపై కలెక్టర్ దృష్టి సారించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.