జహీరాబాద్, మే 6 : తెలంగాణ-కర్టాటక సరిహద్దులోని అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్‌పోస్టులను ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసింది. దీంతో ప్రభుత్వం కోల్పోతున్న ఆదాయాన్ని ఆన్లైన్ విధానంతో భర్తీ చేసేందుకు రవాణా శాఖ సంచార వాహన తనిఖీ(మొబైల్ స్కాడ్)లను ఏర్పాటు చేస్తున్నమని చెప్పినప్పటికీ నేటికి అమలు కావడం లేదు. ఫలితంగా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ముంబయి-హైదరాబాద్ 65వ జాతీయ రహదారితో పాటు న్యాల్కల్ మండలంలోని హుస్సేలి-గణేశ్ఫూర్, మల్గి గ్రామాల శివారులోని తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో రవాణా శాఖ అధికారుల తనిఖీలు, నిఘా కరువుడడంతో అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది.
పారదర్శకత కోసం ప్రభుత్వం ఆన్లైన్ పర్మిట్ల జారీ విధానాన్ని అమలు చేస్తున్నది. దీనికోసం మొగుడంపల్లి మండలంలోని మాడ్గి గ్రామ శివారులోని 65 జాతీయ రహదారి వద్ద అంతర్రాష్ట్ర సరిహద్దులో ఉన్న రవాణా శాఖ చెక్‌పోస్టులను ఇటీవల ఎత్తివేసింది. హైవేలపై నెలకొన్న ట్రాఫిక్ సమస్యతో పాటు రవాణా ఖర్చులు తగ్గించడం, చెక్‌పోస్టుల వద్ద వాహనాలను ఆపాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చెక్‌పోస్టులను ఎత్తివేసిన చోట్లలో అత్యాధునిక ఆటోనంబర్ ప్లేట్ రీడర్(ఏఎన్పీఆర్) కెమెరాలను బిగిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ, నేటికీ అక్కడ కార్యరూపం దాల్చలేదు. హైదరాబాద్-ముంబయి 65వ నంబర్ ప్రధాన జాతీయ రహదారి మీదుగా కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ తదితర ప్రాం తాల నుంచి నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
ఆయా ప్రాంతాల నుంచి ఎక్కువగా సరుకు రవాణాతో పాటు ప్రజా రవాణా చేసే ట్రావెల్స్ బస్సులు, మినీ బస్సులు, ట్యాక్సీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నా యి. చెక్‌పోస్టులు ఎత్తివేయక ముందు అక్కడ అధికారులు తాత్కాలిక అనుమతి పత్రాలు జారీచేసేవారు. నిబంధనలకు విరుద్ధంగా సరకును తీసుకెళ్లే వాహనాలపై కేసులు నమోదు చేసేవారు. ప్రస్తుతం అక్కడ చెక్‌పోస్టులను ఎత్తివేయడంతో పెద్ద ఎత్తున్న పప్పు దినుసులు, శనగ, గోధుమ, బియ్యం, మైదా పండి, స్టీల్, గ్రానైట్, సిమెంట్, ఎలక్ట్రానిక్ వస్తువులు, మద్యం, బియ్యం, గంజాయి తదితర సరుకుల అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది.
చెక్‌పోస్టులను ఎత్తివేయడంతో అనుమతులు లేకుండా సరుకును తీసుకెళ్లే వాహనాలను గుర్తించేందుకు ఈ-ఎన్ఫోర్స్మెంట్ విధానాన్ని అమలు చేస్తామని పభుత్వం చెప్పిన్నప్పటికీ, అది అమలు చేయడం లేదు. ఫలితంగా ఆయా ప్రాంతాల నుంచి సరుకు లోడ్‌తో రాకపోకలు సాగించే వాహనదారులు జీఎస్టీ, రవాణా పన్నులు చెల్లించకుండా అక్రమ రవాణా చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. సంబంధిత అధికారుల పట్టించుకోకపోవడంతో ఆయా ప్రాంతాల నుంచి సరుకు అక్రమ రవాణా భారీగా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి జీరో దందాకు చెక్ పెట్టాలని పలువురు కోరుతున్నారు.