చేర్యాల, మే 21: ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రైతుల సమస్యల పరిష్కారంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని తెలంగాణ రైతు సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట్‌మావో ఆరోపించారు. రైతు సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని వీరన్నపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం నాయకులు సందర్శించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం వెంకట్‌మావో మాట్లాడుతూ ధాన్యం సేకరణపై సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పెరిగిన ధాన్యానికి అనుగుణంగా చర్యలు చేపట్టకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతులు లేక మరోవైపు తెచ్చిన ధాన్యం కాంటా కాక రాత్రి, పగలు అనే తేడా లేకుండా రైతులు కేంద్రాల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రైతు ధాన్యం విక్రయించాలంటే 20 రోజులు పడుతున్నదని, ప్రభుత్వానికి ముందు చూపు లేక రైతులతో పాటు హమాలీలు అనారోగ్యాలకు గురవుతున్నారన్నారు.
బీ గ్రేడ్ పేరిట ధాన్యం తీసుకుపోయిన మిల్లర్లు తాలు పేరిట కోతలు విధిస్తున్నారని, దీంతో రైతులు నష్టపోతున్నట్లు తెలిపారు. హమాలీలకు గుర్తింపు కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి బండకింది అరుణ్‌కుమార్, నాయకులు బైర లింగం, చంద్రం, శ్రీశైలం, నర్సింహులు, సూర్న లింగం, శ్రీనివాస్, శ్రీశైలం, పరశురాములు, భాస్కర్, కనకయ్య పాల్గొన్నారు.