సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 1: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. నెలకు రూ.50 వేల వేతనం పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక ఉన్న వేతనాన్ని సరిగ్గా ఇవ్వడం లేదు. 6 నెలలుగా వేతనాలు రాక కుటుంబ పోషణ భారంగా మారిందని అతిథి అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 192 మంది అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారు. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 88 మంది, సిద్దిపేట జిల్లాలో 72 మంది, మెదక్ జిల్లాలో 32 మంది అతిథి అధ్యాపకులు పనిచేస్తున్నారు.
ఇచ్చే అరకొర వేతనాలను దసరా పండుగ వచ్చినా ఇవ్వక పోవడంతో ఆ కుటుంబాల్లో పండుగ సంతోషం కరువైంది. ఉన్నత చదువులు చదివి ఉన్నత ఆశయంతో విద్యాబోధన చేస్తున్న అతిథి అధ్యాపకుల జీవితం ఆగమైంది. ఏడాదిలో 12 నెలలు ఉంటే అతిథి అధ్యాపకులకు మొత్తంగా అందేది కేవలం 4 నుంచి 5 నెలల వేతనాలు మాత్రమే. జూలై చివరి వారంలో నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగంలో చేరిన అతిథి అధ్యాపకులకు సెప్టెంబర్ నెలలో దసరా సెలవుల కారణంగా వేతన కోత విధించగా, అక్టోబర్ మాసం మధ్యలోనే సెమిస్టర్ పూర్తి కావడం జరుగుతుంది. నవంబర్లో పరీక్షల నెల కారణంగా ఎలాంటి వేతనం ఉండదు.
డిసెంబర్ మాసం దాటితే తిరిగి జనవరిలో సంక్రాంతి సెలవులతో వేతన కోత, ఫిబ్రవరిలో పూర్తి వేతనం ఇవ్వనుండగా, మార్చి మధ్యలోనే సెమిస్టర్ పూర్తి కావడం, ఏప్రిల్లో మరోసారి సెమిస్టర్ పరీక్షల కారణంగా వేతనం ఉండదు. మే మాసం వేసవి సెలవులు, జూన్, జూలై మాసాల్లో మరోసారి నోటిఫికేషన్ ఎదురు చూపులు. గత ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల బకాయే అతిథుల అధ్వాన స్థితికి నిదర్శనం. ఇదీ వారి ధీనస్థితి. వేతనం రూ.50 వేలకు పెంచుతామని, కన్సాలిడేట్ పే ఇప్పిస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవడం లేదు.
దీనిపై అతిథి అధ్యాపకులు పలుసార్లు ప్రగతి భవన్లో ప్రజావాణికి సైతం వెళ్లి అక్కడ ఉన్న మంత్రులు, ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేయడంతో పాటు సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించడం లేదు. ఒక్కో పీరియడ్ రూ.390 చొప్పున నెలకు గరిష్టంగా 72 పీరియడ్లకు రూ.28వేలుగా వేతనం నిర్ధారించారు. అందులోనూ అన్నీ కోతలే. ఇప్పటికైనా తమకు ఇచ్చిన మాట ప్రకారం వేతనాలను పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలని అతిథి అధ్యాపకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టు, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సేవలు అందిస్తున్న తమను గుర్తించాలని కోరుతున్నారు.
ఏడాది కాలం పాటు కళాశాలలో సేవలు అందిస్తున్న మాకు వేతనాల్లో కోత విధించడం సరికాదు. గత ఏప్రిల్లో కేవ లం నాలుగు రోజుల వేతనాలు రావాల్సి ఉన్నా ఇప్పటి వర కు రాకపోవడం మాపై ప్రభుత్వ వైఖరి స్పష్టమవుతున్నది. ఆరునెలలుగా వేతనాలు లేక అప్పులు చేయాల్సి వస్తున్నది.
– ఎస్ దేవేందర్, అతిథి అధ్యాపకుడు, సంగారెడ్డి
వేతనాలు విడుదల చేయాలి ఆరు నెలలుగా వేతనాలు లేక కుటుంబపోషణ బారంగా మారింది. నెలనెల వేతనాలు ఇవ్వకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలి. వచ్చే అరకొర వేతనాలను కూడా కనీసం రెండు నెలలకు కూడా ఇవ్వకపోతే అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వం ఏమి చేస్తున్నట్టు. ఇప్పటికైనా మాకు రావాల్సిన బకాయి వేతనాలను వెంటనే విడుదల చేయాలి.
– బి శ్రీనివాస్, అతిథి ఆధ్యాపకుడు, సంగారెడ్డి
సమయానికి వేతనాలు రాకపోవడంతో అప్పుల పాలవుతున్నాం. 6 నెలలుగా వేతనాలు రాకపోవడంతో ఎవరిని అప్పు అడగాలో తెలియని అయోమయ పరిస్థితి ఉంది. అతిథి అధ్యాపలకు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వేతనాలను పెంచి నెలనెలా కన్సాలిడేట్గా అందించాలి.
– ఆర్.రమేశ్, అతిథి అధ్యాపకుడు, కంఫ్యూటర్ సైన్స్
కళాశాలల్లో అవసరాన్ని బట్టి అతిథి అధ్యాపకుల సంఖ్యలోనూ మార్పులు జరుగుతుంటాయి. ఏండ్ల్లపాటు పని చేసినా అధ్యాపకులను ఎప్పుడు వద్దంటారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది. నేను పదేండ్లుగా సేవలందించినప్పటికీ, నిర్ధాక్షిణంగా తీసేశారు. కనీస ఉద్యోగ భద్రత లేకుండా అతిథి అధ్యాపకుల వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
– జె.రాజశేఖర్, అతిథి అధ్యాపకుడు, తెలుగు