గుమ్మడిదల, డిసెంబర్ 24: హైదరాబాద్‌కు సమీపం లో ఉన్న గుమ్మడిదల మేజర్ గ్రామ పంచాయతీ, గడ్డపోతారం మేజర్ గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలుగా ఏర్పాటు కానున్నాయి. కొత్తగా ఏర్పాటయ్యే గుమ్మడిదల మున్సిపాలిటీలో అన్నారం, దోమడుగు, బొంతపల్లి, వీరన్నగూడెం తో కలిసి ఐదు గ్రామ పంచాయతీలతో కొత్త మున్సిపాలిటీగా గుమ్మడిదలను ఏర్పా టు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. 28 వేల జనాభా కలిగిన ఈ ఐదు గ్రామ పంచాయతీలతో మున్సిపాలిటీగా మార్చనున్నట్లు తెలిసింది. ఈ కొత్త మున్సిపాలిటీలో బొంతపల్లి, దోమడుగు, అన్నారం పారిశ్రామికవాడలు కావడంతో కొత్తగా ఏర్పాటు జరిగే మున్సిపాలిటీగా మంచి ఆదాయం సమకూరే అవకాశం ఉంది. ఈ పారిశ్రామికవాడలో చిన్న పరిశ్రమలు 30, భారీపరిశ్రమలు 35 కుపైగా ఉన్నాయి. దీంతో ఈ మున్సిపాలిటీకి పన్నుల రూపంలో భారీగా ఆదాయం అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. గుమ్మడిదలలో ఓటర్లు 7050, బొంతపల్లిలో 6వేలు, అన్నారంలో 4800,దోమడుగులో 4 వేలు, వీరన్నగూడెంలో 1200 ఓటర్లు ఉన్నారు. 28వేల జనాభా ఉంది. గుమ్మడిదల వ్యవసాయాధారిత గ్రామంగా పేరుగాంచింది. మిగిలిన గ్రామాల్లో పరిశ్రమలు ఉండడంతో ఈ గ్రామాల్లో ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చిన కార్మికులు పరిశ్రమలో పనిచేసుకుంటున్న వారి జనాభా కూడా అధికంగానే ఉంది. ఇటీవల శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయనున్న ట్లు అసెంబ్లీలో ప్రకటించారు. మంత్రి ప్రకటనపై ఇక్కడి గ్రామాల ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. మున్సిపాలిటీగా మారితే పన్నుల భారం పడుతుందని ప్రజలు మున్సిపాలిటీ ఏర్పాటుపై విముఖత చూపుతున్నట్లు తెలిసింది.
జీహెచ్ఎంసీ జవహర్ నగర్ చెత్తశుద్ధి కేంద్రంపై భారం తగ్గించడానికి మరోచోట డంపింగ్ యార్డు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. దీనికి అనువైన స్థలాలను గుర్తించింది. హైదరాబాద్ మహానగరంలో ఉన్న 17 మున్సిపాలిటీల చెత్తను జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుకు తరలిస్తుండడంతో నిత్యం 9వేల మెట్రిక్ టన్నుల వ్యర్థ్ధాలు చేరుతున్నాయి. దీనిపై భారం తగ్గించడానికి హైదరాబాద్‌కు సమీపంలోని గుమ్మడిదల మండలం నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో 152 ఎకరాలను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్నప్పుడు గుర్తించారు. అప్పట్లో డం పింగ్ యార్డు ఏర్పాటుపై గుమ్మడిదల మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీలు, మండల పరిషత్ ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకించి ఏకగ్రీవ తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపారు. తిరిగి కాంగ్రెస్ వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో మళ్లీ డంపింగ్‌యార్డు ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. గతంలో డంపింగ్‌యార్డు ఏర్పాటును వ్యతిరేకించి ప్రజాప్రతినిధులతో జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ చర్చించినట్లు తెలిసింది. కానీ, ప్రజాప్రతినిధులు, నాయకులు ససేమిరా అనడంతో కాంగ్రెస్ సర్కారు కొత్తగా మున్సిపాలిటీ ఏర్పాటు ఆలోచన ముందుకు తెచ్చిందని నాయకులు ఆరోపిస్తున్నారు. డంపింగ్ యార్డు ఏర్పాటుకు అంగీకరిస్తే ఓకే, లేకపోతే మున్సిపాలిటీగా మార్చి బలవంతంగా డంపింగ్ యార్డు ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ గుమ్మిడిదల మండలంలోని వీరన్నగూడెం, నాగిరెడ్డిగూడెం, వీరారెడ్డిపల్లి, రాంరెడ్డిబావి గూడెం కొత్త పంచాయతీలుగా ఏర్పాటయ్యాయి. ఈ పంచాయతీలుగా ఏర్పాటు జరిగిన ఏడేండ్ల కాలంలో ఎంతో అభివృద్ధి జరిగింది. సీసీ రోడ్లు, కొత్త పంచాయతీలు, కమ్యూనీటి భవనాలు, యూజీడీ పనులు, మౌలిక వసతుల కల్పనలో అభివృద్ధిలో ముందుకు సాగాయి. ప్రజలకు పాలన చేరువు కావడంతో సంతోషించారు.ఇప్పుడు తమ గ్రామాలను మున్సిపాలిటీగా మారిస్తే పాలన దూరంతో పాటు పన్నుల భారం పడుతుందని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. గుమ్మడిదల మున్సిపాలిటీ ప్రకటనలో గుమ్మడిదల, బొంతపల్లి, వీరన్నగూడెం, దోమడుగు, అన్నారం పంచాయతీలు కలువనుండడంతో ఇక్కడి పంచాయతీల్లో ని ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. మున్సిపాలిటీ ఏర్పాటు వద్దని ఇటీవల మంత్రి దామోదర రాజనర్సింహను కొందరు కాంగ్రెస్ నాయకులు కలిసి విజ్ఞప్తి చేశారు.
గ్రామపంచాయతీగా ఉంటే ఏటా కేంద్ర నుంచి ఆర్థిక సంఘం ద్వా రా నిధులు వస్తాయి. ఈ నిధులతో గ్రామాభివృద్ధి చేసుకోవచ్చు. ఎమ్మె ల్యే, ఎంపీ నిధులతో పాటు సీఎస్ఆర్ నిధులతో మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. స్థానికంగా ఉన్న పరిశ్రమలు, వ్యాపార సముదాయాలు, ఇంటి పన్నులు, ఆస్తి పన్నుల రూపంలో నేరుగా పంచాయతీల ఖజానాకు వస్తాయి. దీంతో గ్రామ పారిశుధ్య కార్మికులకు, సిబ్బందికి, గ్రామంలో పర్యావరణాన్ని పెం పొందించుకోవడం కోసం, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు ఖర్చు చేయవచ్చు. గ్రామాన్ని బల్దియాలో కల్పితే ప్రజలు ఈజీఎస్ పనులు కోల్పోతారు. ప్రజలకు పాలన దూరమవుతుంది. పన్నుల భారం పెరుగుతుంది. పర్మిషన్లు సులభంగా పొందలేము.
– పొన్నబోయిన వేణు, మాజీ ఎంపీటీసీ, వీరన్నగూడెం
కొత్తగా ఏర్పాటైన వీరన్నగూడెంలో కొత్తగా పంచాయతీ భవనం నిర్మించుకున్నాం. సీసీ రోడ్లు, యూజీడీ పనులు పూర్తి చేసుకుంటున్నాం. ప్రజలకు పాలన పరంగా అందరికీ అందుబాటులో ఉన్నాం. ఇక ము న్సిపాలిటీలో కలిస్తే ప్రజలపై పన్నుల భారం పడుతుంది. పాలన దూరమవుతుంది. ఏ పని కావాలన్నా మున్సిపాలిటీకి పరుగులు తీయాల్సి వస్తుంది. మున్సిపాలిటీ నుంచి మా గ్రామాన్ని తప్పించాని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.
– పొన్నబోయిన మమత, మాజీ సర్పంచ్, వీరన్నగూడెం