తూప్రాన్, డిసెంబర్ 27 : మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి వెంకటాపూర్ (పీటీ)లోని లలితా పరమేశ్వరీ దేవి ఆలయంలో సహస్ర చండీ మహాయాగ మహోత్సవాలు ఆలయ వ్యవస్థాపకులు సోమయాజుల రవీంద్రశర్మ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా ఆరంభమయ్యాయి. ఉదయం 8గంటలకు విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాలు మొదలయ్యాయి.

అనంతరం స్వస్తివాచనం, మంటపారాధన, అఖండ దీపారాధన, రుత్విగ్వరణం, కలశ స్థాపన, ఆవాహిత స్థాపిత దేవతా పూజలు, అగ్నిమథనం, కుండస్థాపన, అగ్నిస్థాపన, అమ్మవారికి చతుషష్ట్యుపచార పూజ, మహాన్యాస పూ ర్వక ఏకాదశ రుద్రాభిషేకం, స్థాపిత దేవతా హవనం, చండీరుద్ర యాగాలు, మధ్యాహ్నం బ్రహ్మశ్రీ మరుమాముల శశిధరశర్మ (విపంచి మ్యూజికల్ అకాడమీ) సిద్ధిపేట వారిచే అమ్మవారికి నీరాజన సేవ, కోలాటం, సాయంత్రం స్థాపిత దేవతాహవనం, చండీహవనం, ప్రదోషపూజ, రాజో పచారాలు, మంగళ హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు.
తొలిరోజు నిర్వహించిన కార్యక్రమానికి తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రాఘవేందర్ గౌడ్‌తో పాటు పాలకవర్గ సభ్యులు హాజరై అమ్మవారి సేవలో పాల్గొన్నారు. తొలిరోజు భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.