సిద్దిపేట, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల జిల్లాల సరిహద్దులోని అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి శ్రీ రాజరాజేశ్వర(మిడ్‌మానేరు) రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను సోమవారం నుంచి ఎత్తిపోస్తున్నారు. రెండు పంపు ల ద్వారా జలాలను ఎత్తిపోస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, అడుగంటిన రిజర్వాయర్ల ఫలితంగా వానకాలం సాగుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు శనివారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి లేఖ రాయడంతో ప్రభుత్వం స్పందించి సోమవారం నుంచి మిడ్‌మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల చేస్తామని చెప్పింది.
అందులోభాగంగా నీటిని విడుదల చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ అక్కడి నుంచి మల్లన్నసాగర్ తర్వాత కొండ పోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాలను ఎత్తిపోయనున్నారు. ఫలితంగా అన్ని రిజర్వాయర్లు నిండితే పంటల సాగుకు ఇబ్బంది ఉండదు.
జిల్లాలోని రైతుల సాగునీటి కష్టాలపై ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు రాసింది. జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులపై ఐదారు రోజులుగా రైతులను పలుకరించి, వారి అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో సక్సెస్ అయింది. ఎట్టకేలకు సోమవారం నుంచి గోదావరి జలాలు జిల్లాకు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంంలో మండుటెండల్లో సైతం రిజర్వాయర్లు నిండుకుండలా ఉండడంతోపాటు చెరువులు, కుంటలు సైతం మండుటెండల్లో మత్తళ్లు దుంకాయి.
వర్షాకాలంలో ఒకటిరెండు పెద్ద వర్షాలు పడగానే చెరువులు కుంటలు నిండాయి. ఫలితంగా రైతులకు పుష్కలంగా సాగునీరు లభ్యమయ్యేది. ఐదారు సంవత్సరాల నుంచి రైతులకు ఎప్పుడు కూడా సాగు నీటి కొరత ఏర్పడ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సాగు నీటి కొరత ప్రారంభమైంది. జిల్లాలోని రిజర్వాయర్లు డెడ్ స్టోరేజీకి పడిపోయాయి. నాలుగేండ్లుగా కాళేశ్వరం నీటితో కళకళలాడిన రిజర్వాయర్లు నేడు నీళ్లులేక బోసిపోయి కనిపించిన దృశ్యాలపై వరుస కథనాలను అందించింది. మొత్తంగా గోదావరి జలాలు అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి రావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక రిజర్వాయర్ తర్వాత మరో రిజర్వాయర్‌ను నింపనున్నారు.