సిద్దిపేట,ఆగస్టు11: రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కాలువల ద్వారా నీటిని విడుదల చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించాలని మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అధికారులను కోరారు. ఆదివారం నీటిపారుదల శాఖ ఎస్ఈ బస్వరాజ్, ఈఈ గోపాలకృష్ణతో ఆయన ఫోన్లో మాట్లాడారు. రంగనాయక సాగర్‌లో ప్రస్తుతం 2.8 టీఎంసీల నీరు ఉందని, ప్రాజెక్టు పూర్తిసామర్థ్యం మేర 3 టీఎంసీలు నీటిని నింపాలన్నారు.రిజర్వాయర్ల నుంచి కాలువల్లోకి నీటిని విడుదల చేసేందుకు ముందు కాలువల్లో పేరుకుపోయిన పిచ్చిమొక్కలు, గడ్డిని తొలిగించాలని కోరారు.
ఆదివారం రంగనాయక సాగర్‌ను హరీశ్‌రావు సందర్శించారు. మిడ్‌మానేరు నుంచి రంగనాయక సాగర్‌లోకి వస్తున్న గోదావరి జల సవ్వడులను చూసి సంతోషం వ్యక్తం చేశారు. రైతులకు నీరు అందించాలనే నిత్య తపనకు ఈ గోదావరి జలాలే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.సిద్దిపేట నియోజకవర్గ రైతులకు గొప్ప వరం రంగనాయక సాగర్ అన్నారు.