సంగారెడ్డి/ కంది, మార్చి 13(నమస్తే తెలంగాణ): క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ బై సబ్జెక్ట్ 2025లో ఐఐటీ హైదరాబాద్ ఆరు విభాగాల్లో గ్లోబల్ గుర్తింపు సాధించింది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) ఆరు విభాగాల్లో ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో స్థానం పొందింది. ఇందులో మూడు విభాగాలు మొదటగా ర్యాంకింగ్స్లో చోటు దక్కించుకున్నాయి.
ప్రపంచ స్థాయి సాంకేతిక విద్యా విభాగంలో మొదటి సారిగా 501-510 శ్రేణిలో ర్యాంకు పొందింది. ప్రపంచ, ఆసియా ర్యాంగింగ్స్లో మెరుగుదల సాధించింది. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ బై సబ్జెక్ట్ 2025 తాజా జాబితా విడుదలలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) ఆరు విభాగాల్లో ప్రపంచ స్తాయిలో గుర్తింపు పొందింది. ఈ ప్రతిష్టాత్మక ర్యాంకింగ్ ఐఐటీహెచ్ విశిష్ట విద్యా ప్రమాణాలు, పరిశోధన ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా 100 ప్రదేశాలలోని 1700 సంస్థల 18300లకు పైగా విద్యా కార్యక్రమాలను మదింపు చేయడం ద్వారా ఈ ర్యాకింగ్స్ రూపొందించబడ్డాయి. హైదరాబాద్ ఐఐటీహెచ్కు ఇది ఒక కీలకమైన విజయంగా నిలిచింది. ప్రపంచ స్థాయి విద్యా విభాగమైన ఇంజినీరింగ్, టెక్నాలజీలో మొదటి సారిగా 501-510 శ్రేణిలో స్థానం సంపాదించుకున్నది. జాన్ 2024లో విడుదలైన క్యూఎస్ ర్యాంకింగ్స్ 2025 ప్రకారం ఐఐటీహెచ్ దేశంలోని పాప్ పది సాంకేతిక విద్యాసంస్థల్లో తన స్థానాన్ని కొనసాగించడమే కాకుండా రెండోతరం ఐఐటీల్లో అత్యుత్తమంగా నిలిచింది.