సిద్దిపేట, జూలై 4: ‘రియల్ ఎస్టేట్ ఒక పెద్ద వ్యాపారం, రియల్ ఎస్టేట్ బాగుంటే దానికి అనుబంధంగా ఎన్నో రంగాలు బాగుంటాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థ మొత్తం కుప్పకూలింది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందితే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం పెరుగుతుందన్నారు. సిమెంట్, స్టీల్, టైల్స్, శానిటరీ, మార్బుల్స్ వంటి అనేక రంగాల్లో యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. వందలాది వ్యాపారాలు సజావుగా సాగుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని, దాని ప్రభావంతో హోటళ్లు, దుకాణాలు, ఇతర అనుబంధ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. కాంగ్రెస్ పాలనలో రియల్ ఎస్టేట్ వ్యాపారం రివర్స్ అయ్యిందన్నారు.
ఇది ఒక సిద్దిపేట పరిస్థితి కాదని.. రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉందన్నారు. ఎకడ చూసినా వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని, దుకాణాలు నడవడం లేదన్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులతో వాహనాల ఈఎంఐలు కూడా చెల్లించలేక ఫైనాన్స్ సంస్థలు వాహనాలు స్వాధీనం చేసుకుంటున్నాయన్నారు. పిల్లల ఫీజులు చెల్లించలేక కొందరు పట్టణాలు వదిలి గ్రామాలకు వెళ్లి వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వాలు మారొచ్చు.. కానీ అభివృద్ధి ఆగకూడదు, వ్యాపారాలు దెబ్బతినకూడదు, అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నిబంధనల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒకవైపు హైడ్రా చర్యలు, మరోవైపు ప్రతికూల దృక్పథం, రకరకాల నిబంధనలతో వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు.
సిద్దిపేటకు రేవంత్‌రెడ్డి అనే గ్రహణం పట్టింది. ఆ గ్రహణానికి మూడేండ్లు పూర్తయ్యా యి. ఇంకో రెండేండ్లు ఆ గ్రహణం ఉంటుందని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆ రెండేండ్లు ఓపిక పడితే తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి రోజులు వస్తాయని, ఎవరూ అధైర్యపడొద్దని, మీరందరూ ధైర్యంగా ఉండాలని కోరారు. సిద్దిపేటకు మళ్లీ మంచి భవిష్యత్ వస్తుందన్నారు. కోటి రూపాయల విలువైన ఆస్తి కూడా అమ్ముడుపోవడం లేదని, పిల్లల పెళ్లిళ్లు చేయాలన్నా, అవసరాల కోసం భూమి అమ్ముకోవాలన్నా ఆ పరిస్థితి లేదన్నారు.
ఒకప్పుడు బంగారం కంటే సిద్దిపేటలో ప్లాట్ విలువ ఎకువ ఉండేదని, ఎకరం భూమి మారెట్లో అమ్ముడయ్యేదన్నారు. బంగారం కంటే భూమి విలువైనదని నమ్మి చాలామంది భూములు కొనుగోలు చేశారన్నారు. ఆరోజు కోటి రూపాయలు పలికిన భూమి ఈరోజు అరవై లక్షలకైనా కొనేవారు లేరన్నారు. ఆనాడు కేసీఆర్ రైతు విలువ పెంచి రైతుబంధు ఇచ్చారని గుర్తుచేశారు. రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్, కాళేశ్వరం నీళ్లు తెచ్చారన్నారు. ఆయిల్ పామ్ పరిశ్రమ తీసుకొచ్చారన్నారు. రైతు గౌరవాన్ని పెంచి రైతు జీవితంపై కేసీఆర్ నమ్మకం కలిగించారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు సిద్దిపేటలో ఎకరం పది లక్షలు ఉండేదని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్లు, రోడ్లు, చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు నీళ్లతో నిండాయన్నారు.
రైతు బంధు, రైతు బీమా వచ్చిందన్నారు. ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, ఐటీ టవర్, ఇండస్ట్రియల్ పార్, మెడికల్ కాలేజీ, రైలు వచ్చిందన్నారు. జిల్లా కేంద్రంగా సిద్దిపేట అద్భుతమైన అభివృద్ధి సాధించిందన్నారు. ఇతర జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా మంది ఇకడికి వచ్చి పెట్టుబడులు పెట్టారన్నారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. సగం ధరకు కూడా ప్లాట్లు అమ్ముడుపోవడం లేదన్నారు. ఇప్పటికే మూడేండ్లు గడిచిపోయాయి, ఇంకొంచెం ఓపిక పట్టండి మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారన్నారు. తప్పకుండా మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద కిలోమీటర్ల వేగంతో సిద్దిపేట అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు.
సిద్దిపేటలో అన్ని దికులా సమాన అభివృద్ధి కోసం కలెక్టరేట్, నర్సింగ్, మెడికల్ కాలేజీలు, కేంద్రీయ విద్యాలయం, రైల్వేస్టేషన్ వంటి సంస్థలు తీసుకొచ్చామని హరీశ్‌రావు అన్నారు. రంగనాయకసాగర్ వద్ద పర్యాటక అభివృద్ధి కోసం డెస్టినేషన్ సెంటర్, బోట్ హౌస్, గెస్ట్‌హౌస్‌లు ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేసినా ప్రభుత్వం మారడంతో ఆ పనులు ఆగిపోయాయని ఆరోపించారు. వెటర్నరీ కాలేజీ, వ్యవసాయ కళాశాల, మెడికల్ కాలేజీ వంటి విద్యాసంస్థల ద్వారా సిద్దిపేటను అన్నిరకాల ఉన్నత విద్యా కేంద్రంగా తీర్చిదిద్దామని, కానీ కొన్ని ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయన్నారు.