పటాన్చెరు/పటాన్చెరు రూరల్ డిసెంబర్ 4 : సంగారెడ్డి జిల్లా పాశమైలారం, పటాన్‌చెరులోని పారిశ్రామికవాడల్లో కోట్లాది రూపాయల విలువైన భూములను హిల్ట్ పాలసీతో అప్పనంగా అమ్ముకునేందుకు రేవంత్ సర్కార్ కుట్ర చేస్తోందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. గురువారం మాజీ మంత్రి కమలాకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి పాశమైలారం పారిశ్రామికవాడలో పర్యటించారు. ఈ సందర్బంగా ఖాయిలా పడిన పరిశ్రమలను వారు సందర్శించారు. మొదట బీపీఎల్ పరిశ్రమను పరిశీలించారు. ఖాయిలా పడిన బీపీఎల్ పరిశ్రమల గురించి బీఆర్ఎస్ నాయకులు ఆరా తీశారు. అనంతరం అక్కడే ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ(హిల్ట్)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆతర్వాత ఇతర పరిశ్రమలను పరిశీలించారు.
సంగారెడ్డి జిల్లాకు శరాఘాతం…
హిల్ట్ పాలసీ సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక రంగానికి శరాఘాతం లాంటిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హిల్ట్ పాలసీతో ప్రభుత్వం రూ.వేలకోట్ల విలువైన భూములను అప్పనంగా అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. దీంతో జిల్లాలోని పరిశ్రమలు మూతపడటంతో పాటు కార్మికులు ఉపాధి కోల్పోతారని, కార్మికులు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాలసీ ద్వారా రేవంత్ సర్కార్ సంగారెడ్డి జిల్లాలో 1760 ఎకరాల భూములను మల్టీ యూజ్ జోన్స్‌లోకి మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు. 1984-85లో పాశమైలారం పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం రైతుల నుంచి పెద్దఎత్తున భూములను సేకరించారన్నారు. ఎకరాకు రూ.3500 చొప్పున అప్పటి ప్రభుత్వాలు 340 ఎకరాలకు పైగా భూములను రైతుల నుంచి సేకరించినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు ఆ భూముల విలువ కోట్ల రూపాయలకు చేరిందన్నారు. కానీ, రేవంత్ సర్కార్ హిల్ట్ పాలసీ ద్వారా ఈ భూములను ఎకరాకు రూ. 27లక్షలకు అమ్మే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.
ఆ భూములను తిరిగి రైతులకు అప్పగించాలని, లేకపోతే ప్రజావసరాల కోసం ఉపయోగించాలని డిమాండ్ చేశారు. హిల్ట్ పాలసీలో మల్టీజోన్‌లోకి మార్చనున్న 1760 ఎకరాల్లో కొన్ని ఖాయిలా పరిశ్రమలు ఉండగా, చాలా పరిశ్రమలు ప్రస్తుతం ఉత్పత్తి దశలో ఉన్నట్లు చెప్పారు. ఉత్పత్తి దశలో ఉన్న పరిశ్రమలను మూసివేసి ఆ భూములను మల్టీజోన్‌లోకి మార్చి హైరైజ్ బిల్డింగ్లు, కాలనీలు నిర్మిస్తే కార్మికులు రోడ్డున పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు, కార్మికులకు మేలు జరగాలంటే ప్రభుత్వం వెంటనే హిల్ట్ పాలసీని వెనక్కి తీసుకోవాలని, లేదంటే హిల్ట్ పాలసీపై పోరాటం ఉధృతం చేస్తామని మాజీమంత్రి గంగుల ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
భూ కుంభకోణాలకు పాల్పడుతున్న రేవంత్ : ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
సీఎం రేవంత్ భూ కుంభకోణాలకు పాల్పడుతూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ సర్కార్ మొదటి నుంచి భూముల కుంభకోణానికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. తెలంగాణలో రూ.కోట్ల విలువైన భూములను అమ్మి, ఆ డబ్బులను రేవంత్ ఢిల్లీ అధిష్టానానికి పంపుతూ తన పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. మూసీ సుందరీకరణ పేరుతో మూసీ చుట్టుపక్కల భూములపై కన్నేశారని ఆరోపించారు.
ఆ తర్వాత సీఎం కేసీఆర్ నిర్మించతలపెట్టిన ఫార్మాసిటీని రద్దు చేసి అక్కడ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామంటూ రేవంత్ భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు కొత్తగా సర్కార్ పారిశ్రామిక వేత్తల భూములపై కన్నేసి హిల్ట్ పాలసీ తీసుకువచ్చినట్లు చెప్పారు. పాశమైలారంలో పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన రైతులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్రనాయకులు శివకుమార్, శ్రీకాంత్‌గౌడ్, కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, బాల్‌రెడ్డి, సోమిరెడ్డి, మాణిక్‌యాదవ్, రాములుగౌడ్, కుమార్‌గౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణ, మేరాజ్ ఖాన్, కృష్ణయాదవ్, చందు, వీరేశ్ పాల్గొన్నారు.
లక్షల కోట్ల స్కామ్: మాజీమంత్రి గంగుల
మాజీ మంత్రి గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. రేవంత్ సర్కార్ హిల్ట్ పాలసీతో రూ.5 లక్షల కోట్ల స్కామ్‌కు తెరలేపిందని ఆరోపించారు. హిల్ట్‌లో భాగంగా వందలాది ఎకరాల విలువైన భూములను తక్కువ ధరకే రెగ్యులరైజ్ చేసి, ఆ తర్వాత ఆభూములను సొంతం చేసుకునేందుకు రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం పనిచేస్తుందన్నారు. ఈ భూముల విషయంలో కాంగ్రెస్, బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ఒక్కటే తెలంగాణ భూములు, ఆస్తులను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నదని గంగుల కమలాకర్ అన్నారు.