గజ్వేల్, అక్టోబర్ 3: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో సీసీ రోడ్లు దెబ్బతిన్నాయి. దీంతో పట్టణ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వార్డుల్లో సీసీ రోడ్ల మధ్య నుంచే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టడంతో సీసీరోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని కాలనీల్లో పనులు చేపట్టగా మరికొన్ని కాలనీల్లో నేటికీ పనులు చేపట్టకపోవడంతో సీసీ రోడ్ల అధ్వానంగా మారా యి. ఎయిర్టెల్ కాలనీలో ప్రధాన రోడ్డుకు కొద్దిదూరంలోనే సీసీ దెబ్బతినడంతో భారీ వాహనాలు వెళ్లే సమయంలో సీసీ రోడ్డు కుంగిపోయింది.
రాత్రి సమయంలో కాలనీల్లోకి వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది దూరంలోనే మురుగుకాల్వ కూలిపోవడంతో వర్షపు నీళ్లతో ఇబ్బందిగా మారింది. మహతి ఆడిటోరియం పక్క కాలనీలో సీసీ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. గతంలో ఈ కాలనీకి మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో కాలనీ వాసులు రోడ్డుపై నడవలేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇప్పటికైనా అధ్వానంగా మారిన సీసీ రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.