గజ్వేల్, జూలై 16 : గజ్వేల్‌లోని ప్రభుత్వ జిల్లా దవాఖానకు ముచ్చటగా మూడోసారి అవార్డు దక్కింది. మూడు నెలల క్రితం కాయకల్ప వైద్యాధికారుల బృందం గజ్వేల్ ప్రభుత్వ దవాఖానను పరిశీలించింది. నాణ్యతా ప్రమాణాలు, వైద్యసేవలు, మెటర్నిటీ, స్వచ్ఛత తదితర అంశాలను పరిగణిలోకి తీసుకుంది. ఇటీవల కాయకల్ప అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. అవార్డుల్లో గజ్వేల్ జిల్లా దవాఖానకు రెండోస్థానం దక్కింది. రాష్ట్రంలో మొదటి స్థానంలో తాండూరు, నిర్మల్ జిల్లా దవాఖానలు నిలువగా, రెండోస్థానంలో గజ్వేల్, సిరిసిల్ల జిల్లా దవాఖానలు నిలిచాయి. కాయకల్ప అవార్డు కింద గజ్వేల్ జిల్లా దవాఖానకు రూ.10లక్షల నిధులు సమకూరనున్నాయి. గతంలో 2019-20లో గజ్వేల్ ఏరియా దవాఖానకు కంమెడేషన్ అవార్డు కింద రూ.లక్ష, 2020-21 ఆర్థిక సంవత్సరంలో కాయకల్ప ఈకో-ఫ్రెండ్లీ కేటగిరీలో విన్నర్‌గా నిలిచింది. అవార్డు కింద రూ.5లక్షల నిధులు సమకూరాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కాయకల్ప అవార్డుల్లో రెండోస్థానంలో నిలిచినందుకు దవాఖానకు రూ.10లక్షల నిధులు సమకూరనున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్ తెలిపారు.