గజ్వేల్, ఏప్రిల్ 15: బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ఉద్యమ స్ఫూర్తితో ప్రతి కార్యకర్త ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి తరలిరావాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్ మున్సిపాలిటీ, ఆర్అండ్ఆర్ కాలనీలకు చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని పట్టణంలోని శోభా గార్డెన్లో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ సహకారంతో గజ్వేల్ మున్సిపాలిటీలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నామని, అక్కడక్కడ పెండింగ్‌లో ఉన్న పనులకు 16నెలల కాలంలో కాంగ్రెస్ పూర్తి చేయలేకపోయిందన్నారు. అధికారంలోకి వస్తే అందరికీ న్యాయం చేస్తామని చెప్పిన నాయకులు ఎక్కడా కనబడడం లేదన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని, ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో గజ్వేల్‌లో వేసవి వచ్చిందంటే తాగునీటికి బిందెలతో కొట్లాడిన పరిస్థితులను చూశామని, కేసీఆర్ ఆడబిడ్డలకు మంచినీటి సమస్య రావద్దనే ఉద్దేశ్యంతో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా ద్వారా శుద్ధిచేసిన నీళ్లను ఇస్తున్నట్లు తెలిపారు. గజ్వేల్‌లో సమీకృత మార్కెట్, ఆర్డీవో కార్యాలయం, అద్భుతమైన రోడ్లు, ఎడ్యుకేషన్ హబ్, రింగ్‌రోడ్డు, సీసీ రోడ్లు, మురుగుకాల్వలు, బట్టర్ ఫ్లై లైట్లు, కుల సంఘాల భవనాల నిర్మాణాలతో పాటు అనేక అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్నట్లు చెప్పారు.
అనంతరం ఛలో వరంగల్ వాల్‌పోస్టర్‌ను ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు నవాజ్‌మీరా, నాయకులు జకీయొద్ద్దీన్, కొట్టాల యాదగిరి, జాఫర్‌ఖాన్, సురేశ్, ప్రతాప్‌రెడ్డి, మంజుల పాల్గొన్నారు.