రాష్ట్ర రాజకీయాల్లో గజ్వేల్ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. సమైక్య రాష్ట్రం నుంచి మొదలుకుని ఇప్పటి వరకు గజ్వేల్ నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నది. గతంలో కాంగ్రెస్, టీడీపీ పోటాపోటీగా తలపడినప్పటికీ, కేసీఆర్ అడుగుపెట్టిన తర్వాత గజ్వేల్‌లో వార్ వన్‌సైడ్ అయ్యింది. రాష్ట్ర రాజధానికి దగ్గరగానే గజ్వేల్‌లో సమైక్య పాలనలో అంతమాత్రంగానే అభివృద్ధి జరిగింది. ఇక్కడి నుంచి గద్దెనెక్కి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన వారు అంతగా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గజ్వేల్ నుంచి పోటీచేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ నియోజకవర్గాన్ని దేశానికే మోడల్‌గా మార్చారు. ఆయన వచ్చాకే గజ్వేల్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఈ పదేండ్ల పాలనలో వందేండ్ల అభివృద్ధిని చేసి చూపించారు. అప్పుడు మాటిచ్చారు..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కొంతమంది రైతులు, బీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. నీళ్లు లేక పొలాలన్నీ బీళ్లవుతున్నాయని, అమ్మేసుకోవాలని అనుకుంటున్నట్లు మాటల మధ్యలో కేసీఆర్‌కు వివరించారట. ఈ సమయంలో కేసీఆర్ వారికి భరోసా కల్పిస్తూ, తొందరపడొద్దు, తెలంగాణ ఏర్పాటు తర్వాత గోదావరి నీళ్లతో నియోజకవర్గ పొలాలను తడిపేస్తానని మాట ఇచ్చారట. ఈ విషయాన్ని గజ్వేల్‌లో రైతులు పదేపదే గుర్తుచేసుకుంటారు. అన్నట్టుగానే తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంతో పాటు రైతులకు మాట ఇచ్చినట్టుగా గోదావరి జలాలు తెచ్చి గజ్వేల్ నియోజకవర్గాన్ని పావనం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు గజ్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎకరా పది లక్షల రూపాయలకు కూడా అమ్ముడుపోయేది కాదు. అవే పొలాలు ఇప్పుడు కోట్లు పలుకుతున్నాయి. ఇదంతా కేసీఆర్ దార్శనికత వల్లే సాధ్యమైంది. గతంలో ఎండిన పొలాల కనిపించేవి. ఇప్పుడు గజ్వేల్ నుంచి ఎటువైపు వెళ్లినా పచ్చటి పొలాలు దర్శనమిస్తున్నాయి. గతంలో ఈ ప్రాంతంలో నీళ్లకోసం ప్రజలు పడ్డ పాట్లు అన్నీ ఇన్నీ కావు. అర్ధరాత్రి కూడా బోరింగుల వద్ద ప్రజలు పడిగాపులు పడేవారు. ప్రతిరోజూ పానీపట్టు యుద్ధాలే.. నీళ్లకోసం మేం చిన్నప్పుడు పడిన ఇబ్బందులు గుర్తొస్తే గుండె బాధతో తడిసి ముద్దవుతుంది. ఇప్పుడు పుష్కలమైన నీళ్లు కనిపిస్తున్నాయి.
గజ్వేల్‌ను 2014కు ముందు, 2014కు తర్వాత అన్నట్టుగా చూడాలి. రాజీవ్ రహదారికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే గజ్వేల్‌కు వెళ్లాలంటే ప్రజ్ఞాపూర్‌లో బసు దిగాల్సి ఉండేది. ఒకప్పుడు ఎగుడు దిగుడు, గుంతలతో కూడిన రోడ్డుపై వెళ్లాలంటే ఎంతో భయం వేసేది. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మధ్యలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరిగేవి. ఇప్పుడు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రోడ్డు విశాలంగా, ఆహ్లాదంగా కనిపిస్తోంది. నాలుగు లేన్ల రోడ్డు, మధ్యలో డివైడర్, బట్టర్ ఫ్లైలైట్లు, చెట్ల మధ్య నుంచి ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా మారింది. ప్రజ్ఞాపూర్ రాకముందే రింగ్‌రోడ్డు అందరికీ స్వాగతం పలుకుతుంది. గజ్వేల్‌కు ప్రవేశించిన వెంటనే జిల్లా దవాఖాన ఎదురవుతుంది. గతంలో ఏ చిన్న అనారోగ్య సమస్య తలెత్తినా హైదరాబాద్ పరుగెత్తాల్సి వచ్చేది. అంబులెన్స్‌లు అందుబాటులో ఉండేవి కావు. ఇప్పుడు గాంధీ దవాఖానను తలదన్నేలా గజ్వేల్ దవాఖాన ఉందంటే అతిశయోక్తి కాదు. ఏ కార్పొరేట్ వైద్యశాలకూ తీసిపోదు. కేసీఆర్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని దవాఖానను నిర్మించారు. జిల్లా దవాఖానకు సమీపంలోనే పాత ప్రభుత్వ దవాఖానను అధునాతన ప్రసూతి దవాఖానగా మార్చేశారు. గజ్వేల్ ఏరియా దవాఖానలో కార్పొరేట్ వైద్యం అందుబాటులో ఉంది.
ఒకవైపు జాతీయ రహదారి, మరోవైపు రాష్ట్ర రహదారి ఉన్న గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు మాత్రం సరైన ప్రయాణ వసతుల్లేక ఇబ్బందులు పడ్డారు. గజ్వేల్ వాసులు రైల్ కూత వినాలంటే సికింద్రాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. 60ఏండ్ల పాటు రాష్ర్టాన్ని పాలించిన నేతలు కానీ, దేశంలో అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ నేతలకు కానీ గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలను కలుపుతూ రైలు మార్గాన్ని నిర్మించాలన్న సోయే లేదు. సిద్దిపేట ఎంపీగా గెలిచిన కేసీఆర్ పోరాడి సాధించిన కొత్తపల్లి-కరీంనగర్ రైల్వేమార్గాన్ని తాను ముఖ్యమంత్రిగా ఉండి పూర్తి చేయించారు. అంతా పూర్తయిన తర్వాత జెండాలు ఊపి, మోదీ పేరు చెబుతున్న బీజేపీ నాయకులు, అసలు ఆ రైల్వేలైన్ ఎలా మంజూరు అయిందో కూడా తెలిసి ఉండే అవకాశమే లేదు. కేవలం కేసీఆర్, హరీశ్‌రావు చొరవ వల్లే ఇప్పుడు గజ్వేల్, సిద్దిపేట వాసు లు రైళ్లలో తిరుగుతున్నారు. కేసీఆర్ ముందుచూపు, పట్టదల వల్లే సాధ్యమైంది.
కాళ్లకు వేసుకునే చెప్పులను ఏసీ షోరూముల్లో కొంటాం. కానీ, తినే కూరగాయలను మాత్రం రోడ్డు మీద కొనుగోలు చేస్తాం. గజ్వేల్‌లో మాత్రం అందుకు భిన్నం. మనం తినే కూరగాయలు, మాంసాన్ని అత్యద్భుతంగా నిర్మించిన షాపుల్లో అమ్ముతారు.గజ్వేల్ నడిబొడ్డున ఉన్న గడియారం స్తంభపు వ్యాపార సముదాయం కేసీఆర్ ఆలోచనల్లోంచి పుట్టిన మరో ఆణిముత్యం. గతంలో జూనియర్ కాలేజీ, బస్టాండ్ ఉన్న ప్రదేశాలను కలిపి ఇప్పుడు అతిపెద్ద సమీకృత మార్కెట్ కాంప్లెక్స్ నిర్మించారు. ఇది గజ్వేల్‌కు మకుటాయమానం. ఇందులో వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు దేశానికే ఆదర్శంగా మారాయి.
గజ్వేల్ ముట్రాజ్‌పల్లి రోడ్డులో మిల్క్‌సెంటర్ సమీపంలో నిర్మించిన మహతి ఆడిటోరియం అన్నిరకాల సభలు, సమావేశాలు, సాహితీ గోష్టు లు, పుస్తకావిష్కరణలకు కేంద్రం. అన్నిరకాల సాంస్కతిక కార్యక్రమాలకు వారధిగా మారింది.
ఏఊరికైనా చెరువే జీవనాధారం. గజ్వేల్‌లో కూడా జాలిగామ వెళ్లే దారిలో పాండవుల చెరువు ఉంది. పాండవులు ఆ ప్రాంతంలో సంచరించినట్టుగా చెబుతుంటారు. అందుకే చెరువుకు పాండవుల చెరువు అని పేరు వచ్చిందని చెబుతుంటా రు. గతంలో ఆ చెరువును పట్టించుకున్న వారే లే రు. నీళ్లులేక, ఎండిపోయిన చెరువు వైపు ఎవరూ వెళ్లే వారు కాదు. ఏడాదిలో రెండుసార్లు గణేశ్ నిమజ్జనం,బతుకమ్మ పండుగ సమయాల్లో మాత్రమే జనం చెరువు వైపు వెళ్లేవారు. నీళ్లులేక చిన్నకుంటలో నిమజ్జనం చేసేవారు.కానీ, ఇప్పు డు సాయంత్రం అయిందంటే ప్రజలంతా చెరువు దగ్గరకే చేరుకుంటున్నారు. పాండవుల చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేశారు. పిల్లలు ఆడుకోవడానికి, పెద్దల కోసం ఓపెన్‌జిమ్, పర్యాటకుల కోసం బోటింగ్, ఒక్కటేమిటీ.. ఇప్పుడు ఈ చెరువు ఓ ఎంటర్టైన్మెంట్ ప్లేస్. గతంలో ఈ చెరువులో నీళ్లు ఉండేవి కావు. మిషన్ కాకతీయలో అభివృద్ధి చేయడంతో కళకళలాడుతోంది.
ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో హైదరాబాద్‌తో గజ్వేల్ పోటీపడుతోంది. గజం రేటు కొన్ని ప్రదేశాల్లో యాభై వేల రూపాయలు దాటింది. గతం లో ఎందుకు పనికిరాని ప్రదేశాల్లో ఇప్పుడు వెంచర్లు వెలిశాయి. అభివృద్ధి దూసుకెళ్లడంతో చుట్టుపక్కల గ్రామాలు గజ్వేల్‌లో కలిసిపోయాయి. గజ్వేల్ చుట్టుపక్కల ఉండే గ్రామాలు ప్రజ్ఞాపూర్, జాలిగామ, బయ్యారం, రాజిరెడ్డిపల్లి, సంగుపల్లి, సంగాపూర్, క్యాసారం, ముట్రాజ్‌పల్లి ఇప్పుడు గజ్వేల్‌లో భాగం అయిపోయాయి. గజ్వేల్ ఒక్కటే కాదు, గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్, ములుగు, వర్గల్, తూప్రాన్, వంటిమామిడి ప్రాంతాలు అద్భుతంగా అభివృద్ధి చెందాయి. అన్ని గ్రామాల్లో అద్దంలాంటి రోడ్లు, ప్రతిరోజు తాగునీళ్లు, మిషన్ భగీరథలో భాగంగా చెరువుల అభివృద్ధి, డబుల్ బెడ్రూం ఇండ్లు.. ఇలా ఒక్కటేమిటి, అన్నిరంగాల్లో గజ్వేల్ నియోజకవర్గ గ్రామాలు అలరారుతున్నాయి. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ గజ్వేల్ నియోజకవర్గంలోనిదే. కొండపోచమ్మ సాగర్‌తో రైతులకు నీటి సమస్యల లేకుండా పోయింది. వర్షాధారం మీద ఆధారపడిన రైతులు ఇప్పుడు కాల్వల ద్వారా వచ్చే నీళ్లతో రెండు పంటలు పండిస్తున్నారు. కొండపోచమ్మ సాగర్ పర్యాటక స్థలంగా మారింది. గతంలో రాజులు రాజధానులను నిర్మించడం పుస్తకాల్లో చదివిన మనకు.. ప్రస్తుత గజ్వేల్‌ను చూస్తుంటే కొత్తగా నిర్మించినట్టే కనిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అభివృద్ధికి గజ్వేల్ కేరాఫ్ అడ్రస్.
ఎన్నికల సమయం కావడంతో ఇప్పుడు అన్నిపార్టీలు గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేసేందుకు ఈటల రాజేందర్ సిద్ధమయ్యారు. ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీచేసి గెలుస్తానని ఈటల బీరాలు పలుకుతున్నారు. బెంగాల్లో మమతా బెనర్జీపై సువేందు అధికారి విజయం సాధించినట్టుగానే గజ్వేల్‌లో కేసీఆర్‌పై తాను విజయం సాధిస్తానని ఈటల పగటి కలలు కంటున్నారు. కానీ, ఇది బెంగాల్ కాదు.. తెలంగాణ.. గజ్వేల్.. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్. ఇలాంటి గజ్వేల్‌లో ఈటల రాజేందర్, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పోటీ నిలబడడం అంటే బలిచ్చేందుకు మేకపోతును సిద్ధం చేసినట్టే. ఈటల రాజేందరే కాదు, స్వయంగా మోదీ వచ్చినా గజ్వేల్‌లో కేసీఆర్‌పై గెలుపొందడం అసాధ్యం. గజ్వేల్ ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారు. హ్యాట్రిక్ కొట్టేయాలని చూస్తున్నారు. కేసీఆర్‌ను గెలిపించి తమను తామే గెలిపించుకోవాలని పట్టుదలతో ఉన్నారు. గజ్వేల్ నుంచి పోటీచేస్తున్న తూంకుంట నర్సారెడ్డి కానీ, ఈటల రాజేందర్ కానీ తాము గెలిస్తే ఏం చేస్తామో ఇప్పటి వరకు చెప్పలేదు. కేసీఆర్‌ను విమర్శించడం తప్పా నియోజకవర్గానికి ఏం చేస్తామో చెప్పడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు కోరుకున్న దాని కంటే ఎక్కువే కేసీఆర్ చేసి పెట్టారు. అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం చేశారు. స్కూళ్లు కట్టించారు, చెరువులు తవ్వించారు. దవాఖానలు నిర్మించారు. రోడ్లు వేయించారు, రవాణా సౌకర్యాలను మెరుగు పర్చారు. ప్రజలకు కావాల్సిన అన్ని పనులను ఎవరూ కోరకుండానే పూర్తి చేశారు. అందుకే ఇప్పుడు నియోజకవర్గ ప్రజలు తమ అభిమాన నేతను మరోసారి గెలిపించుకుని, కృతజ్ఞత చెప్పేందుకు తహతహలాడుతున్నారు. ప్రజల స్పందన చూస్తేంటే ఈసారి ప్రత్యర్థి పార్టీలకు డిపాజిట్లు కూడా రావడం సందేహమే.
గతంలో గజ్వేల్‌లో విద్యాలయాలు అక్కడొక్కటి.. ఇక్కడొక్కటి అన్నట్టుగా విసిరేసినట్టుగా ఉండేవి. పాత, అద్దె భవనాల్లో అవి కొనసాగేవి. కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అన్ని విద్యాలయాలను ఒకేచోటికి మార్చాలన్న ఆలోచన చేశారు. గజ్వేల్‌ను ఎడ్యుకేషనల్ హబ్‌గా మార్చాలన్న ఆలోచనను ఆచరణలో పెట్టారు. సంగాపూర్ రోడ్డులో అన్ని విద్యాలయాలను ఒకేచోటకు చేర్చి ఎడ్యుకేషనల్ హబ్‌ను నిర్మించారు. కొత్తవారెవరైనా అటుగా వెళ్తే.. ఇక్కడేంటి యూనివర్సిటీ ఉంది అని ఆశ్చర్యపోవడం గ్యారంటీ. విద్యాలయాల కోసం నిర్మించిన భవనాలను చూస్తే కళ్లు చెదరాల్సిందే. హైటెక్‌సిటీ కార్పొరేట్ ఆఫీస్ హంగులకు ఏమా త్రం తీసిపోవు. ఆ భవనాలను చూస్తుంటేనే అందులో తమ పిల్లలను చదివించాలని తల్లిదండ్రులు ఆశపుట్టడం ఖాయం.
గజ్వేల్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. గతంలో అభివృద్ధి అంటే రోడ్లు వేయడం, ఉన్న బిల్డింగ్‌లకు రంగులు అద్దడం.. లేదంటే కొత్త కాలేజీకి పర్మిషన్ తీసుకురావడం. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి ఇది మాత్రమే. ఇప్పుడు అభివృద్ధి మొత్తం గజ్వేల్‌లో కనిపిస్తోంది. గజ్వేల్ ప్రతి గజం మారిపోయింది. నయా గజ్వేల్ కనిపిస్తోంది. ఏగల్లీకి వెళ్లినా సిమెంట్ రోడ్లు, ఇక రహదారికి ఇరువైపునా పచ్చనిచెట్లు, అందమైన రోడ్లు గజ్వేల్‌ను చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తోంది. వైకుంఠధామాలు పార్కులను తలపిస్తున్నాయి.