హుస్నాబాద్, సెప్టెంబర్ 1: ఏండ్ల తరబడి నిరాదరణకు గురైన గ్రామీణ లింకురోడ్లకు మహర్దశ పట్టనున్నది. ఇన్నేండ్లయినా ఇంకా మట్టి రోడ్డుపైనే ప్రయాణం చేస్తున్న మారుమూల గ్రామాల ప్రజలు ఇక తారురోడ్డుపై ప్రయాణం చేసే తరుణం వచ్చేసింది. సమైక్యపాలనలో నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ ప్రాంతాలు ప్రభుత్వం ముందుచూపుతో అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి. ముఖ్యంగా రోడ్ల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి లింకురోడ్ల నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు విడుదల చేస్తోంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు చాలావరకు రోడ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ ఇంకా మిగిలి ఉన్న మారుమూల గ్రామాల మట్టి రోడ్లను గుర్తించి వాటి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడంతో ఇటీవల నియోజకవర్గానికి రూ.21.30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ లింకురోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, అందుకు కృషి చేసిన ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, మంత్రి హరీశ్‌రావులకు ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చిగురుమామిడి, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, సైదాపూర్ మండలాల్లోని 14 లింకురోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇటీవల రూ.21.30కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో ఆయా మండలాల్లో సాధారణ మట్టి రోడ్లు తారురోడ్లుగా మారనున్నాయి. హుస్నాబాద్ మండలంలోని మాలపల్లి నుంచి కూచనపల్లి మీదుగా జడ్పి రోడ్డు వరకు 3కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.2కోట్ల నిధులు వచ్చాయి. కోహెడ మండలం చెంచల్‌చెర్వుపల్లి నుంచి వెంకటేశ్వరపల్లి వరకు 1.70కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.1.20 కోట్లు, కాచాపూర్ నుంచి పందిల్ల వరకు 1.13కి.మీ.ల రోడ్డుకు రూ.కోటి నిధులు, చిగురుమామిడి మండలం సీతారాంపూర్ నుంచి పీచుపల్లి ద్వారా పర్లపల్లి వరకు 7కిలోమీటర్లకు రూ.5కోట్లు, ఆర్అండ్బీ రోడ్డు నుంచి ఓగులాపూర్ వరకు 2కి.మీ.లకు రూ.1.60కోట్లు, రామంచ నుంచి ముదిమాణిక్యం వరకు 2కి.మీ.లకు రూ.1.60 కోట్లు, సైదాపూర్ మండలంలోని బీటీరోడ్డు నుంచి గుజ్జులపల్లి వరకు 3కి.మీ.ల రోడ్డుకు రూ.70 లక్షలు, పెర్కపల్లి నుంచి దుద్దెనపల్లి 4కి.మీ.లకు రూ.1.25కోట నిధులు మం జూరయ్యాయి. భీమదేవరపల్లి మండలంలోని గట్లనర్సింగాపూర్ నుంచి బొల్లోనిపల్లి వరకు 3కి.మీ.లకు రూ.1.70కోట్లు, జడ్పీ రోడ్డు నుంచి చంటయ్యపల్లి వరకు 500మీటర్ల రోడ్డుకు రూ.50లక్షలు, ఎల్కతుర్తి మండలంలోని ఎల్కతుర్తి నుంచి దామెర వరకు 1.50కి.మీ.లకు రూ.1.50కోట్లు, కేశవాపూర్ నుంచి రామకిష్టాపూర్ వరకు 1.30కి.మీ.లకురూ.1.20కోట్లు, ఎల్కతుర్తి నుంచి దండెపల్లి వరకు 550మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.55లక్షల పంచాయతీరాజ్ నిధులు మంజూరయ్యాయి.
నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లోని ప్రాధాన్యత గల రోడ్ల నిర్మాణానికి నిధు లు మంజూరయ్యాయి. ఈ పనులు పూర్తయితే నియోజకవర్గంలో 95శాతానికిపైగా రోడ్ల నిర్మాణం పూర్తయినట్లే. తొమ్మిదేండ్లలో పంచాయతీరాజ్ శాఖ నుంచి పెద్దఎత్తున నిధులు మంజూరు చేయించి కొత్త రోడ్లు వేయడం, శిథిలావస్థకు చేరిన రోడ్లకు మరమ్మతులు చేయిస్తున్నాం. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సహకారంతో నియోజకవర్గానికి నిధులు రావ డం ఆనందంగా ఉంది. వారికి కృతజ్ఞతలు.
– వొడితెల సతీశ్‌కుమార్, ఎమ్మెల్యే, హుస్నాబాద్