సిద్దిపేట, మార్చి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్కు పట్టున్న ఉమ్మడి మెదక్ జిల్లాపై రేవంత్‌రెడ్డి సర్కారు కక్షసాధింపులకు పాల్పడుతున్నది. కేసీఆర్ హయాంలో మంజూ రు చేసిన పలురోడ్ల అభివృద్ధి పనులను రద్దు చేయడంతోపాటు నిధులను ఇతర జిల్లాలకు మళ్లించింది. దీంతో జిల్లా ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం ఎండీఆర్ ప్లాన్ కింద ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణాలకు నిధులు కేటాయించింది. తాజాగా ఆ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేస్తూ జీవో 305ను ఫిబ్రవరి 24న జారీచేసింది. నిధులన్నీ రోడ్లు భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన సొంత జిల్లా నల్లగొండతో పాటు సూర్యాపేట తరలించుకు పోయారు. దీంతో కాంగ్రెస్ సర్కారు తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలోని పీడబ్ల్యూ రోడ్డు నుంచి కొల్గూరు మీదుగా అహ్మదీపూర్ (0/0 నుంచి 4/0)వరకు రూ.3 కోట్లు, మీనాజీపేట నుంచి బస్వాపూర్ మీదుగా కొక్కం డ. (0/0 నుంచి 0/10)వరకు రూ.3కోట్లు, రాజీవ్ రహదారి పీడబ్ల్యూ రోడ్డు మీదుగా ము ట్రాజ్‌పల్లి (0/0 నుంచి 7/2)వరకు రూ.30 కోట్లు, మర్కూక్ నుంచి నారాయణపూర్ (0/0 నుంచి 10/0) వరకు రూ.23 కోట్లను రోడ్ల అభివృద్ధికి బీఆర్ఎస్ సర్కారు మంజూరు చేయగా, పనులు పురోగతిలో ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలోని హత్నూర మండలం టౌన్ లిమి ట్స్ దౌల్తాబాద్-చిట్కుల్ రహదారి విస్తరణ (కి. మీ 5/3 నుంచి 8/2)రూ.8 కోట్లు, సిద్దిపేట-ఇల్లంతకుంట ఫోర్‌లైన్ రోడ్డు (కి.మీ 22/0 నుంచి 32/0) రూ.82 కోట్లు (రాజన్న సిరిసిల్ల జిల్లా), సిద్దిపేట-ఇల్లంతకుంట ఫోర్‌లైన్ రోడ్డు (కి.మీ 10/0 నుంచి 22/0) రూ.77 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేయడంతో పను లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇక సంగారెడ్డి- నర్సాపూర్-తూప్రాన్ రోడ్డు (కి.మీ 71/0 నుంచి 72/5, 77/4 నుంచి 78/4) (ఆరు వరుసల రహదారి సిద్దిపేట జిల్లాలో) రూ.19 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేయగా, ఈ రోడ్డు నిర్మాణాలకు నిధులు రద్దు చేస్తూ జీవో విడుదల కావడంతో ప్రజలు కాంగ్రె స్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సిద్దిపేట-ఇల్లంతకుంట రహదారి విస్తరణ పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కోత పెట్టింది. చిన్నకోడూరు నుంచి ఇల్లంతకుంట వరకు విస్తరణ పనులకు నిధులను రద్దు చేసింది. దీంతో సిద్దిపేట ఎల్లమ్మగుడి నుంచి చిన్నకోడూరు వర కు మాత్రమే రహదారి విస్తరణ, బ్రిడ్జీల నిర్మాణాలు, డివైడర్ పనులు జరుగనున్నాయి. 0/0 నుంచి 0/10 కిలోమీటరు వరకు మాత్రమే పనులు జరుగుతాయి. చిన్నకోడూరు నుంచి సలెంద్రి, కమ్మర్లపల్లి, మైలారం, అల్లీపూర్, కిష్టాపూర్ జంక్షన్ మీదుగా సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల కేంద్రం వరకు విస్తరణ పనులకు బ్రేక్ పడింది. సిద్దిపేట-ఇల్లంతకుంట ఫోర్‌లైన్ రోడ్డు (కి.మీ 10/0 నుంచి 22/0) రూ.77 కోట్లు, సిద్దిపేట-ఇల్లంతకుంట ఫోర్‌లైన్ రోడ్డు (కి.మీ 22/0 నుంచి 32/0) రూ.82 (రాజన్నసిరిసిల్ల జిల్లా), కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభు త్వం ఈ రెండు బిట్లకు సంబంధించిన నిధులు రద్దు చేసింది. ఈ నిధులను ఇతర జిల్లాలకు తరలిస్తూ జీవో విడుదల చేసింది.
జిల్లా కేంద్రమైన సిద్దిపేట నుంచి రేణుకాఎల్లమ్మ దేవస్థానం, లింగారెడ్డిపల్లి మీదుగా చిన్నకోడూరు నుంచి ఇల్లంతకుంట (రాజన్నసిరిసిల్ల జిల్లా) వరకు ఫోర్‌లైన్ రోడ్డు విస్తరణకు తన్నీరు హరీశ్‌రావు, రసమయి బాలకిషన్ వినతి మేరకు అప్పటి సీఎం కేసీఆర్ నాలుగు లైన్ల రోడ్డుగా మార్చేందుకు రూ.254 కోట్లు మంజూరు చేశారు. వెంటనే రోడ్లు భవనాలశాఖ జీవో నెంబర్ 127ను విడుదల చేసింది. ఈ రోడ్డు నిర్మాణంతో సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కలుగుతుంది. సిద్దిపేట జిల్లాకేంద్రం నుంచి ఎలమ్మ గుడి, లింగారెడ్డిపల్లి మీదుగా మెట్టుబండలు, మండల కేంద్రమైన చిన్నకోడూరు మీదుగా సలెంద్రి, కమ్మర్లపల్లి, మైలారం, అల్లీపూర్, కిష్టాపూర్ జంక్షన్ మీదుగా సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండల కేంద్రం వరకు 32 కిలోమీటర్ల మేర ఈ రహదారి అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఈ 32 కిలోమీటర్ల మార్గం సిద్దిపేట జిల్లాకేంద్రంతో పాటు చిన్నకోడూరు మండలంలోని 6 గ్రామాలను అనుసంధానం చేస్తూ సిద్దిపేట రూరల్ మండలంలోని బుస్సాపూర్, నంగునూరు మండలంలోని తిమ్మాయిపల్లి రింగు రోడ్డుకు, చిన్నకోడూరు మండలం కిష్టాపూర్ జంక్షన్ వద్ద బెజ్జంకి మండల కేంద్రం అనుసంధానంతో పాటు ఇల్లంతకుంట వరకు జరిగే ఈ మార్గం ఇల్లంతకుంట నుంచి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు అనుసంధానం అవుతుంది. ఒక వరుస నుంచి నాలుగు వరుసల రహదారిగా అభివృద్ధి జరుగుతుందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి నిధులు రద్దు చేసి ఇతర జిల్లాలకు మళ్లించి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేసింది.