మల్యాలకు చెందిన 11 మందికి పూర్తి
నేడు విఠలాపూర్ వాసులకు..
గ్రామాల వారీగా క్యాంపులు
అవసరం ఉన్నవారికి శస్త్ర చికిత్సలు
సిద్దిపేట, మే 19 : పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సీఎం కేసీఆర్ ఆలోచనల అమలు కోసం మంత్రి హరీశ్‌రావు నిరంతరం శ్రమిస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యున్నత వైద్యసేవలు అందుబాటులోకి తీసుకువచ్చి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. మోకాలి నొప్పులతో బాధపడుతున్న వారికి మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్లు ఉచితంగా చేయించిన మంత్రి..తాజాగా కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి ఎల్వీ ప్రసాద్ దవాఖానలో రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్లు చేయించి మారోసారి తన మంచి మనస్సును చాటుకున్నారు.
గురువారం ఎల్వీ ప్రసాద్ దవాఖానలో 11 మందికి మంత్రి కంటి సర్జరీలు చేయించారు. మానవ శరీరంలోని అన్ని అవయవాల్లో కండ్లు ప్రధానమైనవి. ‘సర్వేంద్రియానం.. నయనం ప్రదానం’ అనే నానుడిని నిజం చేస్తూ మంత్రి ప్రత్యేక చొరవతో కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి అవసరం ఉన్న వారికి ఆపరేషన్లు ఉచితంగా చేయించారు. మంత్రి ఆదేశానుసారం జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14న సిద్దిపేట నియోజకవర్గంలోని నారాయణరావుపేట మండలం మల్యా ల, చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌లో కంటి వైద్యశిబిరాలు నిర్వహించి కంటి సమస్యలతో బాధపడుతున్న 75 మందిని గుర్తించారు. మల్యాల గ్రామానికి చెందిన 20 మందిని ఎల్వీ ప్రసాద్ దవాఖానలో డాక్టర్ సందీప్ ఆధ్వర్యంలో అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్లు ప్రగతి, జ్యోతిర్మయి మానస, పూర్వ అగర్వాల్ ఆధ్వర్యంలో 11 మందికి సర్జరీలు చేశారు. వీరిలో 9మందికి మోతె బిందు ఆపరేషన్లు, ఒకరికి డీసీటీ ఆపరేషన్, ఒకరికి దురుమాంసం ఆపరేషన్ చేశారు. నలుగురికి మందులు అందజేశారు. శుక్రవారం పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించనున్నారు. నెలరోజుల పాటు వారానికోసారి పరీక్షలు నిర్వహిస్తారు. విఠలాపూర్‌కు చెందిన 15మందిని గురువారం దవాఖానకు తీసుకువచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు.
విడతలుగా ఆపరేషన్లు
మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మే రకు కంటి వైద్య శిబిరాలు నిర్వహించి కంటి సమస్యతో బాధపడుతున్న వారికి విడతల వారీగా ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నాం. బీపీ, షుగర్‌తో బాధపడుతున్న వారికి మందులు ఇచ్చాం. మందులతో తగ్గకపోతే ఆపరేషన్లు చేయిస్తాం. ఆపరేషన్లు చేసుకున్న బాధితులను ఇంటికి పంపిస్తున్నాం.
–కాశీనాథ్, డీఎంహెచ్‌వో
మంత్రి హరీశ్‌రావుకు రుణపడి ఉంటాం
నేను చాలా రోజుల నుంచి కంటి సమస్యతో బాధపడుతున్న.కూలీ పనిచేసుకుని బతుకుతున్న. ఊర్లో హెల్త్ క్యాంపు పెట్టిండ్రు. పరీక్షలు చేయించుకున్న. ఎల్వీ ప్రసాద్ దవాఖానకు తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్ చేశారు. నాకు ఇప్పుడు బాగుంది. మంత్రి హరీశ్‌రావుకు రుణపడి ఉంటా.
-మహదేవ్ శంకర్, మల్యాల
చల్లని చూపునిచ్చిన దేవుడు
ఇంతకు ముందు కంటిలో నీళ్లు, ఊసులు వచ్చి కండ్లు మసకబారి ఇబ్బంది అయ్యేది. మబ్బు మబ్బుగా కనిపించేవి. మేము అడుగక ముందే మంత్రి హరీశ్‌రావు సార్ ఊర్లోకి డాక్టర్లను పంపి పరీక్షలు చేయించి పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్ చేయించారు. మాకు చల్లని చూపునిచ్చిన దేవుడు మంత్రి హరీశ్‌రావు సార్.
–నాసిరెడ్డి భారతమ్మ, మల్యాల