పటాన్చెరు/ గుమ్మడిదల/ జిన్నారం (బొల్లా రం) / కోహీర్, జనవరి 28: సంగారెడ్డి జిల్లా లో నాలుగు కొత్త మున్సిపాలిటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహీర్ను కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పటాన్చెరు నియోజకవర్గంలోని గడ్డపోతారం, ఇస్నాపూర్, గుమ్మడిదల కేంద్రంగా మరో మూడు కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటయ్యాయి. మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారుల పాలనా బాధ్యతలు అప్పగించింది. ఇస్నాపూర్, గడ్డపోతారం, గుమ్మడిదల పరిసర గ్రామాలను కలుపుతూ మున్సిపాలిటీలుగా ప్రకటించారు.
ఇస్నాపూర్, చిట్కుల్, పాశమైలారం గ్రామాలు ఇస్నాపూర్ మున్సిపాలిటీగా, గుమ్మడిదల, బొంతపల్లి, వీరన్నగూడెం, దోమడుగు, అన్నారం గ్రామాలతో గుమ్మడిదల మున్సిపాలిటీగా, గడ్డపోతారం, కాజీపల్లి, మాధారం, వావిలాల, లక్ష్మీపతిగూడెంతో గడ్డపోతారం మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. తమ గ్రామాలను మున్సిపాలిటీలు చేయవద్దని పలు గ్రామాల ప్రజలు, పంచాయతీలు ఏకగ్రీవ తీర్మానాలు చేసినా అధికారులు పట్టించుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గడ్డపోతారంలో ఐదు పంచాయతీలు, ఇస్నాపూర్‌లో మూడు పంచాయతీలు, గుమ్మడిదలలో ఐదు పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. 1952 నుంచి 1967 వరకు మున్సిపాలిటీగా ఉన్న కోహీర్ జనాభా తగ్గడంతో మేజర్ గ్రామ పంచాయతీగా మార్చారు. ప్రస్తుతం 21వేల వరకు జనాభా పెరగడంతో మంగళవారం మరోసారి కోహీర్ను మున్సిపాలిటీగా ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు మిఠాయిలు తినిపించుకున్నారు.
కోహీర్ మున్సిపల్ కమిషనర్‌గా ఉమామహేశ్వర్రావు…
కోహీర్ మున్సిపల్ కమిషనర్‌గా ఉమామహేశ్వర్రావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం కోహీర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మహ్మద్ మిస్కీన్ నుంచి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత మున్సిపల్ కార్యాలయంలో ఏఈగా హరీశ్, పట్టణ ప్లానింగ్ అధికారిగా నరేశ్, అకౌంటెంట్‌గా లక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. అధికారులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఇస్నాపూర్ మున్సిపల్ కమిషనర్‌గా జ్యోతిరెడ్డి…
ఇస్నాపూర్ మున్సిపాలిటీకి కొత్త కమిషనర్‌గా జ్యోతిరెడ్డిని ఇన్చార్జిగా బాధ్యతలు కేటాయించారు. జ్యోతిరెడ్డి అమీన్‌ఫూర్ మున్సిపాలిటీలో కమిషనర్‌గా పనిచేస్తున్నారు. గ్రామ పంచాయతీల రికార్డులను మున్సిపల్ కమిషనర్ స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. సీడీఎంఏ నుంచి ఆదేశాలు రావడంతో మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్లుగా బాధ్యతలు తీసుకుంటున్నారు. మున్సిపాలిటీల్లో ఇన్చార్జి కమిషనర్లతో పాటు ప్రత్యేకాధికారులు బాధ్యతలు తీసుకుంటారు. రికార్డులు అప్పగించాలని మరోవైపు పంచాయతీలకు కలెక్టరేట్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని సమాచారం. బుధవారం కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ప్రస్తుతం పంచాయతీల ఆన్లైన్ ఎన్ఐసీని నిలిపివేశారు. విలీనం ప్రక్రియ పూర్తయిన తరువాత మున్సిపాలిటీ ఆన్లైన్ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
గుమ్మడిదల బల్దియా కమిషనర్‌గా జి.రఘు
బడంపేట మున్సిపల్ కమిషనర్ జి.రఘు మం గళవారం గుమ్మడిదల బల్దియా కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్‌తో పాటు అకౌంటెంట్ ప్రగతి బాధ్యతలు స్వీకరించారు. వీరిని ఐదు గ్రామాల పంచాయతీ కార్యదర్శు లు ప్రభాకర్, నారాయణ, రాములు, ప్రత్యూ షా, సంగీత వారిని శాలువాతో సన్మానించారు. అనంతరం గుమ్మడిదల, దోమడుగు, బొంతపల్లి, వీరన్నగూడెం, అన్నారం గ్రామపంచాయతీల జీపీ కార్యదర్శులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ గ్రామాల్లోని రికార్డులను మున్సిపల్ కమిషనర్ స్వాధీనం చేసుకున్నారు.
గడ్డపోతారం కమిషనర్‌గా మంగతాయారు
జిన్నారం మండలంలో గడ్డపోతారం గ్రామా న్ని మున్సిపాలిటీగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీ ఇన్చార్జి కమిషనర్‌గా మంగతాయారు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే ఆమె బొల్లారం మున్సిపాలిటీ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గడ్డపోతారం మున్సిపాలిటీలో కాజిపల్లి, మాదారం, వావిలాల, లక్ష్మీపతిగూడెం గ్రామాలతో పాలన ప్రారంభమైంది. గ్రామ పంచాయతీకి సంబంధించిన 9ప్రొఫార్మా రికార్డులను మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్ఐసీ ఆన్లైన్ లాగిన్స్ ఆఫ్ చేశారు. ఇన్చారి కమిషనర్ పేరిట లాగిన్స్ ఇచ్చి, పరిపాలన కొనసాగించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గడ్డపోతారం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సంధ్య బాధ్యతలు స్వీకరించారు.