సిద్దిపేట అర్బన్, డిసెంబర్ 9: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని జడ్పీ మాజీ చైర్పర్సన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల మండిపడ్డారు. ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం బాధాకరమన్నారు. సోమవారం సిద్దిపేటలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ మహిళా నాయకులతో కలిసి జడ్పీ మాజీ చైర్పర్సన్ రోజాశర్మ, మున్సిపల్ చైర్పర్సన్ మంజుల విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలను అడియాశలు చేసిందన్నారు. కేసీఆర్ చావునోట్లో తలపెట్టి, ఎన్నో పోరాటాలు చేసి సాధించిన తెలంగాణలో తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి, బతుకమ్మను తీసివేయడం బాధాకరమన్నారు.
పదేండ్లలో వైభవంగా బతుకమ్మ పండుగ జరుపుకున్నామని, అలాంటి తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మను తీసివేయడం మంచిది కాదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని ఎంతోమంది కవులు, మేధావులు కలిసి రూపొందించారన్నారు. ఎవరైనా తల్లి రూపా న్ని మార్చుకుంటారా.. అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను బంద్ చేశారన్నారు. హైదరాబాద్లో ఆశ వర్కర్లపై పోలీసులు దౌర్జ న్యం చేశారని, మహిళలపై ఈ ప్రభుత్వానికి ఏ మాత్రం గౌరవం లేదన్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీదేవి, కౌన్సిలర్లు రేణుక, దీప్తి, ఇతర మహిళలు పాల్గొన్నారు.