హుస్నాబాద్, ఆగస్టు 19: సర్ ప్రక్రియలో బీఎల్వో పాత్ర ఎంతో కీలకమని, బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించి తప్పిపోయిన వారి పేర్లతో మళ్లీ సంబంధిత ఫారం సమర్పించాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ సూచించారు. బుధవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో నియోజకవర్గంలోని బీఎల్ఏల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 18 నుంచి 25 వరకు సవరణల గడువు ఉన్నందున, దీనిని బీఎల్ఏలు సద్వినియోగం చేసుకొని అభ్యంతరాలు, మార్పు లు, చేర్పులు చేయించాలన్నారు.
సర్ ప్రక్రి య పూర్తయ్యే వరకు బీఎల్ఏలు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. పారదర్శకమైన, తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్కు సంబంధించిన ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బీఎల్ఏలకు ఇటీవల విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితాలు అందజేయడం జరుగుతున్నదని, దీని ప్రకారం జాబితాలో ఉన్న తప్పొప్పులను సరిచేసే బాధ్యతతీసుకోవాలన్నారు. కొత్త ఓటర్ల నమోదుపై కూడా బీఎల్ఏలు, బీఆర్ఎస్ కార్యకర్తలు తీసుకోవాలన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి హాజరైన బీఎల్ఏలు, బీఆర్ఎస్ నా యకులు పాల్గొన్నారు.