మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 27: జిల్లా కేంద్రంలో ఈనెల 29న నిర్వహించే దీక్షా దివస్‌ను సక్సెస్ చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం మెదక్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీస్ చౌరస్తాలో చేపట్టే దీక్షా దివస్ స్థలాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ ఆంజనేయులు, కో కన్వీనర్ లింగారెడ్డి, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, జయరాజ్‌తో కలిసి ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ 60 ఏండ్ల తెలంగాణ ప్రజల కల సాకారం కోసం 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చరిత్రలో నిలిచిపోయిందన్నారు. నాడు కేసీఆర్ చేపట్టిన దీక్ష తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిందన్నారు. అందుకే నవంబర్ 29కి ఎంతో ప్రత్యేకత ఉందన్నారు. కేసీఆర్ చేపట్టిన దీక్ష వల్లనే అప్పటి కేంద్రం దిగివచ్చి తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పి ఉద్యమ చరిత్రపై చెరగని ముద్ర వేసిన మహా నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదన్నారు. కేసీఆర్ పాలనను రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారన్నారు. ప్రజాపాలనను గాలికి వదిలేసి కూల్చివేతలు, పథకాల్లో కోతలు, అభివృద్ధి పేరుతో విధ్వంసాలు కొనసాగిస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని ఆరోపించారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు పట్లోరి రాజు, అరుణ్, కిరణ్, కుమార్ ఉన్నారు.