నారాయణఖేడ్, అక్టోబర్ 27: మంత్రి దామోదర రాజనర్సంహకు నారాయణఖేడ్ నియోజకవర్గంపై, ఈ ప్రాంత రైతులపై చిత్రశుద్ధి ఉంటే కేసీఆర్ హయాంలో రూ.1,774 కోట్ల నిధులతో ప్రారంభించిన బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేయాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి సూచించారు. సోమవారం మనూరు మండలం బోరంచలో పోచమ్మతల్లి ఎత్తిపోతల పథకాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆదివారం మీడియాతో భూపాల్‌రెడ్డి మా ట్లాడారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బోరంచ నల్ల పోచమ్మ తల్లి ప్రాజెక్టు పేరిట ప్రస్తుత మంత్రి దామోదర చేతుల మీదుగానే పనులను ప్రారంభించి నాసిరకంగా చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పథకాన్ని పునరుద్ధరించే దిశగా నిధులు మంజూరు చేయించినప్పటికీ, ఎన్నికల కోడ్ మూలంగా పనులు నిలిచిపోయాయన్నారు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మళ్లీ నిధులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని, హెచ్‌డీపీ పైపులకు బదులుగా డీఐ పైపులు వేసి నిధులను పక్కదారి పట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు, అందోల్ నియోజకవర్గంలోని రెండు మండలాల్లోని 1.65 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన బసవేశ్వర ఎత్తిపోతలతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందనే విషయాన్ని మంత్రి గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.
నియోజకవర్గంలోని నాగల్గిద్ద, నారాయణఖేడ్, కంగ్టి మండలాల్లో కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన ఎనిమిది కొత్త చెరువుల పనులను ఎందుకు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. చెరువుల పనులు చేపట్టే కాంట్రాక్టర్ల వద్ద కాంగ్రెస్ నాయకులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు స్వప్రయోజనాలను పక్కనపెట్టి రైతులకు మేలు చేసే బసవేశ్వర ఎత్తిపోతలతో పాటు కొత్త చెరువుల పనులను ప్రారంభించాలని హితవు పలికారు.