నారాయణఖేడ్, డిసెంబర్ 5: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును రాజకీయంగా ఎదుర్కోలేకనే సీఎం రేవంత్‌రెడ్డి అక్రమ అరెస్టుకు కుట్ర చేశాడని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి ఆరోపించారు. గురువారం సం గారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల విషయమై ఈనెల 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తారనే భయంతోనే హరీశ్‌రావును అరెస్టు చేశారన్నారు. ప్రభుత్వం ఎన్ని అక్ర మ కేసులు పెట్టి జైలులో ఉంచినా బీఆర్ఎస్ నాయకులు కడిగినా ముత్యంలా బయటకు వస్తారన్నారు. గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కోసం పోరాటాలు చేయడమే కాదు, ప్రాణం ఇవ్వడానికి సైతం సిద్ధమని ఆయన స్పష్టం చేశారు.
రేవంత్‌రెడ్డి సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి తన సూసైడ్ నోట్లో రేవంత్‌రెడ్డి సోదరుల పేర్లు రాసి ఆత్మహత్యకు పాల్పడితే వారిపై కేసులు నమోదు చేయని పోలీసులు బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు నమోదు చేస్తూ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నాయకులపై వేధింపులు ఆపకపోతే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, నాయకులు ఎంఏ నజీబ్, రవీందర్‌నాయక్, పరశురామ్, ముజామిల్, అభిషేక్‌శెట్కార్, విఠల్‌రావు, వెంకటేశం, రాజు పాల్గొన్నారు.