వట్పల్లి, మే 23 : ధాన్యం కొనుగోళ్లలో కాం గ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తీవ్ర విమర్శలు చేశారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని ఐకేపీ, పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం పరిశీలించి మాట్లాడారు. నెలరోజులు గడిచినా జిల్లాలో 60 శాతం ధాన్యం కొనుగోళ్లు కూడా పూర్తికాలేదని మండిపడ్డారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో గన్నీసంచులు, కూలీలు, రవాణా, సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించడంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ విఫలమయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యేవని, కానీ ప్రస్తుతం రైతులు రోడ్లపై ధాన్యం పెట్టిన తర్వాతే ప్రభు త్వం స్పందిస్తోందన్నారు. వాహనాల కొరతతో ధాన్యం తరలింపు నత్తనడక సాగుతోందన్నారు.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కొనుగోళ్లు మరో రెండు నెలలు సాగుతాయని, మరో వారం రోజుల్లో వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. ధాన్యం తడిసి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు అందోళన చెందుతున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి యుద్ధప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తిచేయాలన్నారు. యాసంగిలో పండించిన పంటనే సకాలంలో కొనలేని ప్రభుత్వం, వర్షాకాలం పంటను ఎలా కొనుగోలు చేస్తోందని ప్రశ్నించారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతుందన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జైపాల్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సదానందం, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గ్గొన్నారు.