అందోల్, సెప్టెంబర్ 26: సంగారెడ్డి జిల్లా అందోల్‌లో కాంగ్రెస్ నాయకులు ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరలేపుతున్నారని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. గురువారం టేక్మాల్‌లో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడి జోగిపేట ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న పీఏసీఎస్ చైర్మన్ యశ్వంత్‌రెడ్డిని ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారని, మొన్న అల్లాదుర్గంలో బీఆర్ఎస్ నాయకుడు రవీందర్‌రెడ్డిపై దాడిచేశారని,…ఇప్పుడు టేక్మాల్ పీఏసీఎస్ చైర్మన్ యశ్వంత్రెడ్డిపై అకారణంగా దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యశ్వంత్రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి ఘటనలు మళ్లీ పునారవృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని చంటి క్రాంతికిరణ్ డిమాండ్ చేశారు.
టేక్మాల్ సొసైటీలో చైర్మన్, డైరెక్టర్లు మాట్లాడుతుండగా కాంగ్రెస్ నాయకులు వచ్చి ఉద్దేశపూర్వకంగా దాడి చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధైర్యపడొద్దని, ప్రతిఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందన్నా రు. కార్యక్రమంలో టేక్మాల్ మండల పార్టీ అధ్యక్షుడు వీరప్ప, నాయకులు సాయికుమార్, వెంకటేశం, సద్దన్న, రవి, భాస్కర్, దుర్గారెడ్డి, సలీం, రాజుయాదవ్, గోవింద్ చారి, మల్లేశం, ధనుంజయ, బన్నయ్య తదితరులు పాల్గొన్నారు.