టేక్మాల్,జూన్ 27 : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)పై బీఆర్ఎస్ కార్యకర్తలు సీరియస్గా తీసుకోవాలని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పిలుపునిచ్చారు.శనివారం మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని షాబాద్ తండాలో సేవాలాల్ మహరాజ్ భవానీ మాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఆయన హాజరయ్యా రు.అనంతరం మాజీ సర్పంచ్ కిషన్ నివాసంలో కార్యకర్తలతో ముచ్చటించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియపై అక్కడి నాయకులు,కార్యకర్తలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలోని బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు)అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు.ఓటర్ల జాబి తా సవరణలో పొరపాట్లకు తావు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. అర్హులైన స్థానిక ఓటర్ల పేర్లు జాబితా నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తొలిగించకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. చనిపోయిన వారి పేర్లను, ఒకే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఉన్న డబుల్ ఓట్లను గుర్తించి, వాటిని నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితా నుంచి తొలగించేలా చొరవ చూపాలని సూచించారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా చేపట్టడంలో బీఎల్ఏల పాత్ర కీలకం అన్నారు.