గజ్వేల్, మే 11: కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఎట్లుండే…కేసీఆర్ వచ్చినంక ఇప్పుడెట్లుందో ప్రజలు ఆలోచన చేయాలే… గజ్వేల్ రూపురేఖలు మార్చిన కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ..మాయమాటలు చెబుతూ కాంగ్రెస్ దేవుడి మీద ఒట్టు పెడితే…బీజేపీ మన నెత్తిమీద చేయి పెడుతుందన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలుచేస్తానని కుటుంబం మీద ఒట్టుపెట్టి ప్రజలకు మాట ఇచ్చిన వెంకట్రామిరెడ్డికే మద్దతు తెలుపాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
గెలువగానే పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా శిక్షణ ఇప్పిస్తానని, పేద విద్యార్థుల చదువుకు సాయం చేస్తానని, రూపాయికే ఫంక్షన్ హాల్, రూ.10లక్షల బీమా చేస్తానని మీ ముందుకొచ్చిన వెంకట్రామిరెడ్డిని ఆశీర్వదించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మొద్దన్నారు. తెలంగాణ ప్రదాతేకాదు… గజ్వేల్ నవ నిర్మాత కేసీఆర్ అని పేర్కొన్నారు. అప్పుడు గజ్వేల్‌లో చేసిన అభివృద్ధిని చూసి కేసీఆర్‌ను తిట్టిపోసిన ప్రతిపక్షాలు నేడు సిగ్గులేకుండా ఏ మొఖం పెట్టుకొని ఓట్లు అడగడానికొచ్చారో సమాధానం చెప్పాలన్నారు.
ఈరోజు పోటీ ఎవరి మధ్య అంటే గజ్వేల్ అభివృద్ధిని అడ్డుకున్నవాళ్లకు, గజ్వేల్ అభివృద్ధికి మోకాలు అడ్డం పెట్టినోళ్లకు, అభివృద్ధిలో గజ్వేల్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మన కేసీఆర్‌కు మధ్య పోటీ అన్నారు. దుబ్బాకలో ఎమ్మెల్యేగా గెలిచి రూపాయి పని చేయకపోతే దౌల్తాబాద్, రాయపోల్ అక్కాచెల్లెళ్లు 54వేల ఓట్లతో బండకెసి కొట్టారని, ఇప్పుడు దుబ్బాకలో చెల్లని రూపాయి గజ్వేల్‌లో చెల్లుతాద అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ రూ.4వేల పింఛన్ ఇస్తానని మోసం చేసిందన్నారు. 5నెలలు గడిచినా పింఛన్ పెంచలేదని, ప్రతి అవ్వతాతకు రూ.10వేలు బకాయి పడ్డారన్నారు. వంద రోజుల్లో మనకు గాడిద గుడ్డు తప్పా ఏమీ ఇయ్యలేదన్నారు. మహిళలకు రూ. 2500 ఇస్తామని మోసం చేశారన్నారు. రూ. 2500 పడ్డ వాళ్లందరూ కాంగ్రెస్‌కు ఓటు వేయాలని.. పడని వాళ్లంతా కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రివర్స్ గేర్‌లో నడుస్తోంది. కాంగ్రెస్ వచ్చినంక కేసీఆర్ కిట్, గజ్వేల్‌లో రూ.150కోట్ల పనులను రద్దు చేశారని ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. నిన్నటివరకు కేసీఆర్ పక్కనే ఉన్న లీడర్లు పార్టీలు మారారు. ఎక్కడ ప్రభుత్వం ఉంటదో అక్కడికి పోయారా ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు పోయారా మీరే ఆలోచన చేయాలన్నారు. ఎప్పటికైనా మనందరికీ శ్రీరామరక్ష కేసీఆర్, మనకు అన్నం పెట్టిన కేసీఆర్‌ను కాపాడుకోవాలన్నారు. ముస్లింల కోసం మసీద్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్, షాదీఖాన నిర్మించారని, క్రిస్టియన్ల కోసం క్రిస్టియన్ భవనాన్ని నిర్మించారన్నారు.
ప్రజలకు సేవ చేసేందుకు ముందుకొచ్చిన వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఆగంకాకుండా మొదటి ఈవీఎంలోనే వెంకట్రామిరెడ్డి, కారు బొమ్మ చూసి ఓటు వేయాలన్నారు. అందరం బాధ్యత తీసుకొని వెంకట్రామిరెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయిస్తామన్నారు. ఆర్అండ్ఆర్ కాలనీలో మిగిలిన పనులను పూర్తి చేసేందుకు తామంతా సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. కలెక్టర్‌గా ఉన్న సమయంలో వెంకట్రామిరెడ్డికి కాలనీపై అవగాహన ఉందని, మేమంతా మీ వెంటే ఉండి సహకారం అందిస్తామని హరీశ్‌రావు తెలిపారు.
గజ్వేల్‌లో బీఆర్ఎస్ చేపట్టిన రోడ్ షోకు అపూర్వ స్పందన లభించింది. గజ్వేల్ మండల పరిధిలోని గ్రామ పంచాయతీలు, ఆర్అండ్ఆర్ కాలనీలోని ఆయా గ్రామాలు, మున్సిపల్ పరిధిలోని వార్డుల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎండను సైతం లెక్కచేయకుండా ప్రజలు హరీశ్‌రావు ప్రసంగాన్ని విన్నారు. ఆరు గ్యారెంటీల కాంగ్రెస్ కోడిగుడ్డు రోడ్ షోలో ఆకర్షణగా నిలిచింది. ఇందిరాపార్కు చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రోడ్డుకు ఇరువైపులా ప్రజలు నిలబడి ప్రసంగం విన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జకియొద్దీన్, జడ్పీటీసీ మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశం గౌడ్, వైస్ ఎంపీపీ కృష్ణగౌడ్, పట్టణ అధ్యక్షుడు నవాజ్, రవీందర్రావు, చంద్రమోహన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ఆకుల దేవేందర్, యాదగిరి, యుసూఫ్, విరాసత్ అలీ, హైదర్‌పటేల్, ఇస్మాయిల్, రమేశ్ గౌడ్, అక్కారం బాలచంద్రం నాయకులు పాల్గొన్నారు.