అక్కన్నపేట, మే 3: సద్దితిన్న రేవును తలవాలని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌లకు కర్రుకాల్చి వాత పెట్టి కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌ను గెలిపించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం అక్కన్నపేట మండల కేంద్రంలో ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి చంద్రబాబు శిష్యుడని, అక్కడ చంద్రబాబు గెలిస్తే ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను మరికొన్నేండ్లు కొనసాగించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించా రు. కాంగ్రెస్, బీజేపీలకు రాజకీయ ప్రయోజనాలే తప్పా రాష్ట్ర ప్రజలను పట్టించుకోరన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానన్న కాంగ్రెస్ సర్కారు 150 రోజులైనా హామీల అమలు ఏమైందని ప్రశ్నించారు. హామీల్లో భాగంగా కాంగ్రెసోళ్లు ఇచ్చిన బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయని, ఇందుకు శిక్షపడాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలు నిత్యం దేవుళ్ల మీద ఓట్లు… కేసీఆర్ మీద తిట్లు తప్పా చేసేదేమీ లేదన్నారు. ఆచరణలో సాధ్యంకానీ హామీల పేరిట ప్రజలను, ఓటర్లను మభ్యపెడుతూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సర్కారు హయాంలోని సంక్షేమ పథకాలను కాంగ్రెస్ సర్కారు గోవిందా అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు అభివర్ణించారు. గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు కాంగ్రెస్ అడ్డుపడ్డా నిర్మాణం పూర్తి చేసి గోదావరి జలాలను నింపిన ఘనత కేసీఆర్ సర్కార్‌దేనని కొనియాడారు.
అభివృద్ధి సాధకుడు వినోదన్న అని, అక్కన్నపేట అభివృద్ధి చెందాలంటే కారుగుర్తుకు ఓటేసి వినోద్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. ఐదేండ్లలో బండి సంజయ్ కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు అంటేనే మోసమని, బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం రూ.1000 కోట్లు తీసుకొచ్చానన్నారు. అభివృద్ధి అంటేనే బీఆర్ఎస్ అన్నారు. విధ్వంసం అంటే కాంగ్రెస్, బీజేపీనని అభివర్ణించారు. హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు పార్లమెంట్ ఎన్నికల్లో జరగొద్దన్నారు. మన ప్రాంతం గురించి పార్లమెంట్లో మాట్లాడకపోతే మన బతుకులు మళ్లీ ఆగమ్యగోచరంగా మారుతాయన్నారు. ప్రజ లు ఆలోచన చేసి కారు గుర్తుకు ఓటేసి వినోద్‌కుమార్‌ను గెలిపించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, ఎంపీపీ మాలోతు లక్ష్మీబీలూనాయక్, జడ్పీటీసీ భూక్య మంగ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెసరు సాంబరాజు, నేషనల్ లేబర్ కోఆపరేటివ్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.