సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయులకు సమాజంలో ప్రత్యేక స్థానం ఉంటుందని.. ఎవరికీ దొరకని గౌరవం ఒక ఉపాధ్యాయుడికే దొరుకుతుందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని టీటీసీభవన్లో గురుపూజోత్సవం సందర్భంగా నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార వేడుకల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఉపాధ్యాయులు సిద్దిపేట గౌరవాన్ని కాపాడారని.. పదోతరగతి ఫలితాల్లో జిల్లా రెండోస్థానంలో నిలిచిందంటే అది ఉపాధ్యాయుల ఘనతే అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ విద్యావిధానాన్ని ప్రారంభించామన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రారంభించిన ‘మనఊరు- మన బడి’ పనులు మధ్యలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆపి వేయడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం 1700 ప్రభుత్వ పాఠశాలలు, జిల్లాలో 70 పాఠశాలలు మూతపడ్డాయన్నారు.
విద్యా వ్యవస్థ ఇంకా బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, ఉపాధ్యాయులకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. డీఎస్సీ రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు విద్యా వలంటీర్లను ఏర్పాటు చేయాలన్నారు. సిద్దిపేటకు మంజూరు చేసిన వెటర్నరీ కళాశాలను కొండగల్‌కు ఎలా తరలిస్తారని ప్రశ్నించారు. ఐదేండ్లుగా సిద్దిపేట పదోతరగతి ఫలితాల్లో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఇదే స్ఫూర్తితో సమిష్టిగా జిల్లాను మరింత అగ్రగామిగా నిలుపుకొందామన్నారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.